హైదరాబాద్, అక్టోబర్3 (నమస్తే తెలంగాణ): గౌరవెల్లి ప్రాజెక్టును నిర్దేశిత గడువులోగా పూర్తిచేస్తామని, అందుకు పర్యావరణ అనుమతులు, భూసేకరణ, పరిహారం, పునరావాస సమస్యలను పరిషరించాలని అధికారులను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. గౌరవెల్లి ప్రాజెక్టు పనుల పురోగతిపై సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆయన ప్రత్యేక సమీక్షను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, నిర్దిష్టమైన గడువు విధించుకుని ముందుకు సాగాలని సూచించారు.
పరిహారం చెల్లింపులు, భూసేకరణ, పునరావాస సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఆర్థిక, పరిపాలన, న్యాయపర అడ్డంకులుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రాజెక్టు పూర్తికి ఇంకా రూ.114.389 కోట్లు అవసరమని తెలిపారు. పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక, పర్యావరణ నిర్వహణ ప్రణాళిక, ప్రజాభిప్రాయ సేకరణ నివేదికలను ఇప్పటికే సమర్పించామని, త్వరలోనే పర్యావరణ అనుమతులను సాధించి పనులను ముందుకు తీసుకెళ్తామని వెల్లడించారు.