GST on Single Screen Theatres | ప్రేక్షకుల ఆదరణ లేక ముతపడుతున్న సింగిల్ స్క్రీన్ థియేటర్లకు జీఎస్టీని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఊరటను కల్పించింది. ఇంతకుముందు రూ.100లోపు ఉన్న సినిమా టికెట్లపై జీఎస్టీ 12 శాతం ఉండగా.. తాజాగా దానిని 5 శాతానికి తగ్గించింది. దీంతో ఈ నిర్ణయం ద్వారా సింగిల్ స్క్రీన్ థియేటర్లకు గొప్ప ఉపశమనం లభించనుంది. ఎందుకంటే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో చాలా వరకు టికెట్ ధరలు రూ.100 లోపే ఉంటాయి. ఈ పన్ను తగ్గింపు వల్ల టికెట్ ధరలు తగ్గుతాయి, తద్వారా ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది. అయితే, రూ.100 కంటే ఎక్కువ ధర ఉన్న టికెట్లపై పాత జీఎస్టీ రేటు 18% కొనసాగుతుంది. ఈ నిర్ణయం ప్రధానంగా మల్టీప్లెక్స్‌లకు వర్తిస్తుంది. ఇక ఈ కొత్త జీఎస్టీ రేట్లు సెప్టెంబర్ 22, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మార్పు వల్ల సామాన్య ప్రజలకు తక్కువ ధరకే సినిమాలు చూసే అవకాశం కలుగుతుంది. అదే సమయంలో కోవిడ్ తర్వాత ఇబ్బందులు పడుతున్న సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది.
సింగిల్ స్క్రీన్ థియేటర్లను ఆదుకోవాలని, సినిమా రంగాన్ని ప్రోత్సహించాలని చాలా కాలంగా సినీ పరిశ్రమ వర్గాలు, ముఖ్యంగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నాయి. రూ.300 వరకు ఉన్న టికెట్లను 5% జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని MAI ప్రతిపాదించింది. కానీ ఆ ప్రతిపాదనను కౌన్సిల్ ఆమోదించలేదు.