Bala Krishna | సీనియర్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సేవలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లినందుకు గర్విస్తున్నానంటూ తెలిపారు. తన సంతోషాన్ని తండ్రి స్వగ్రామమైన నిమ్మకూరులో ప్రజలతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినట్టు వెల్లడించారు. ‘‘బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి వైద్యసేవలు అందుతున్నాయి. ఇది ప్రతి తెలుగు వాడి గర్వించదగ్గ విషయం,’’ అని బాలయ్య పేర్కొన్నారు. గురువారం నిమ్మకూరులో పర్యటించిన బాలకృష్ణ, దివంగత తండ్రి నందమూరి తారక రామారావు మరియు తల్లి బసవతారకం విగ్రహాలకు పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు.
గురుకుల పాఠశాల విద్యార్థులు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. మహిళలు మంగళహారతులతో సన్మానించారు.అనంతరం బాలయ్య మాట్లాడుతూ.. సినీ రంగంలో 50 ఏళ్లు పూర్తయ్యింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కడం నా అదృష్టం. అయితే ఇది నా వ్యక్తిగత విజయం కాదు, ప్రజలే నన్ను ఇంతదాకా తీసుకొచ్చారు,’’ అని బాలయ్య అన్నారు. పదవులు నాకు ముఖ్యం కావు. పదవులకే నేను అలంకారమన్నది నా భావన అని బాలయ్య నిర్మొహమాటంగా మాట్లాడారు. ప్రజలు నన్ను చూసే దృష్టిలోనే గౌరవం ఉంది. నా స్నేహితులు, అభిమానులు, కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు. ఈ గౌరవాన్ని నా తల్లి బసవతారకం, తండ్రి ఎన్టీఆర్‌కి అంకితం చేస్తున్నాను అన్నారు.
తండ్రి ఎన్టీఆర్ జీవితమే నాకు ఆదర్శం. ఆయన నటన, త్యాగం, ప్రజలతో ఉన్న అనుబంధం ఇవన్నీ నన్ను ప్రభావితం చేశాయి. ఆయన పాత్రలకు జీవం పోసేవారు. ఆయన స్థాయిని చేరాలన్నదే నా లక్ష్యం,’’ అని బాలయ్య పేర్కొన్నారు. హిందూపురంలో తాగునీటి సమస్యను పరిష్కరించడం గర్వంగా ఉంది. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పానికి ఫలితంగా సాధ్యమైంది. రాయలసీమ ప్రజల కోసం ఎప్పుడూ అంకితభావంతో పనిచేస్తాను అన్నారు బాలకృష్ణ. తెలంగాణలో వరదలతో అన్నదాతలు నష్టపోయారు. తెలుగు వారు ఎక్కడ ఇబ్బంది పడినా మనమంతా ఒక్కటిగా ఉండాలి. ప్రతి సినిమాలో నేను ఒక సందేశం ఇవ్వాలనుకుంటా. ‘అఖండ 2’ సినిమాతో హైందవ ధర్మాన్ని ప్రతిబింబించేలా కథను తీర్చిదిద్దాం. ఇది కుల, మతాలకు అతీతంగా అందరిని కలుపుతుంది. సోషల్ మీడియాను మంచికే ఉపయోగించాలి. ద్వేషం కోసం కాదు అని స్పష్టం చేశారు.