హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): పోలీస్ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన పదిరోజుల్లో 3,52,433 దరఖాస్తులు వచ్చాయి. పోలీస్, ఎక్సైజ్, రవాణాశాఖల్లోని వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 17,291 పోస్టుల భర్తీకి పోలీస్ నియామక మండలి ఇటీవల మొత్తం ఆరు నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. మే 2 నుంచి తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ మొదలు కాగా తొలి పదిరోజుల్లో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నట్టు టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. మే 20న రాత్రి 10 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులకు గడువు ఉన్నదని, దాదాపు సగం రోజుల్లో మూడున్నర లక్షల దరఖాస్తులు అందాయని వివరించారు. చివరి వారంలో రద్దీ పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.