ప్రతాప్ పోతన్, అరవింద్‌కృష్ణ, అలీరెజా, ఊర్వశీరాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గ్రే’. ‘ది స్పై హు లవ్డ్ మీ’ ఉపశీర్షిక. కిరణ్ కల్లాకురి నిర్మాత. రాజ్ మాదిరాజు దర్శకుడు. ఆదివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వీఎన్ ఆదిత్య క్లాప్‌నివ్వగా రమేష్ ప్రసాద్ కెమెరా స్విఛాన్ చేశారు. ఈ సందర్భంగా రాజ్ మాదిరాజు మాట్లాడుతూ ‘స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. కొందరి జీవితాల్లోని రిలేషన్షిప్స్, రెవల్యూషన్స్ను ఆవిష్కరిస్తూ తెరకెక్కిస్తున్నాం. ఈ నెల 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’ అని తెలిపారు. సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి సినిమాలకు ఉందని, రాజ్ మాదిరాజు చేస్తున్న ఈ ప్రయత్నం విజయవంతం అవ్వాలని రమేష్ ప్రసాద్ ఆకాంక్షించారు. ఛాలెంజింగ్ పాత్రలో తాను నటిస్తున్న చిత్రమిదని అరవింద్‌కృష్ణ పేర్కొన్నారు. ‘తెలుగులో థ్రిల్లర్ సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి. ఆ లోటును భర్తీచేసే చిత్రమిది’ అని నిర్మాత అన్నారు. ఈ కార్యక్రమంలో అలీరెజా, వివేక్ కూచిభోట్ల తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: నాగరాజు తాళ్లూరి, సినిమాటోగ్రఫీ: ఎం.ఆర్ చేతన్‌కుమార్.