హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ)/ముషీరాబాద్: విద్యావ్యాప్తికి కృషిచేసి.. మహిళల్లో చైతన్యం నింపిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. సోమవారం చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రిబాయి పూలే 191వ జయంతి సభలో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గవర్నర్ దత్తాత్రేయ మాట్లాడుతూ.. సావిత్రిబాయి స్ఫూర్తిగా మహిళలు విద్యా, ఉద్యోగ రంగాల్లో పురుషులతో పోటీపడాలని ఆకాంక్షించారు. బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ మాట్లాడుతూ.. మహిళలు విద్యలో రాణిస్తే సమాజం అభివృద్ధి చెందుతుందని భావించిన సావిత్రిబాయి విద్యాసంస్థలను స్థాపించి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చారని కొనియాడారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మణిమంజరి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆ సంఘం కార్యదర్శి పద్మ, బడేసాబ్, బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్ గౌడ్, గాంధీనగర్ కార్పొరేటర్ పావని, గానసభ అధ్యక్షుడు జనార్దనమూర్తి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలకు సావిత్రిబాయి పూలే స్మారక పురస్కారాలను అందచేశారు. జ్యోతిబా ఫూలే విద్యాలయ సొసైటీ సంక్షేమభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి మల్లయ్యభట్టు మాట్లాడుతూ.. సావిత్రిబాయి ఫూలేను ప్రతి ఉపాధ్యాయురాలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సొసైటీ జాయింట్ సెక్రటరీ రమణారెడ్డి, డిప్యూటీ సెక్రటరీ ఇందిర, అసిస్టెంట్ సెక్రటరీ పద్మజ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.