చివ్వెంల, సెప్టెంబర్ 26 : ప్రభుత్వ ఉపాధ్యాయుడు పది కోట్లు అప్పుగా తీసుకుని కుటుంబంతో ఉడాయించిన ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం లక్ష్మీనాయక్ తండాలో వెలుగుచూసింది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన బానోత్ రాజు.. శెట్టిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అదే మండలం హున్యా తండాకు చెందిన బాణోతు నాగేందర్‌తోపాటు మరికొందరి వద్ద లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. తాను ప్రభుత్వ ఉపాధ్యాయుడినని, లోన్‌కు దరఖాస్తు చేశానని, లోన్ రాగానే డబ్బులు ఇస్తానని చెప్పినట్టు బాధితులు పేర్కొన్నారు.
‘నా పేరిట ఉన్న ఆస్తులను బినామీల పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన. మీరిప్పుడు మమ్మల్ని ఏమీ చేయలేరు’ అని రాజుతోపాటు అతని భార్య తమను బెదిరించేవారని వారు పేర్కొన్నారు. వారం రోజులుగా వారు గ్రామంలో కనిపించకుండా పోయారని, ఫోన్ చేస్తే స్పందించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. రాజుతోపాటు అతని భార్యపై చట్టపరమైన చర్యలు తీసుకొని, తమకు న్యాయం చేయాలని ఎస్పీ నరసింహతోపాటు చివ్వెంల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కే సు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్టు ఎస్సై మహేశ్వర్ తెలిపారు. టీ చర్ రాజు సుమారు రూ. 10 కోట్లతో ఉడాయించాడంటూ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నది. కాగా రూ.కోటి చొప్పున అప్పుగా ఇచ్చిన బాధితులు ఫిర్యాదు చేసినట్టు ఎస్సై తెలిపారు.