క్రికెట్..ఈ ఆటకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పిల్లల నుంచి పండు ముసలి వరకు అందరూ ఇష్టపడేవారే. ఆటపై ఉన్న ఆసక్తితో శిక్షణ తీసుకోవాలనుకున్నా.. ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు ఎదుర్కొనే వారు కోకొల్లలు. ప్రైవేట్ అకాడమీలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న తరుణంలో ప్రభుత్వం ప్రత్యేక అకాడమీని నిర్వహిస్తున్నది. ఫరూఖ్‌నగర్ మండలం కమ్మదనం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వేదికగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో అమ్మాయిలకు అత్యుత్తమ శిక్షణ ఇస్తున్నారు. గత నాలుగేండ్లుగా ఇక్కడ తర్ఫీదు పొందిన వారిలో భారత జట్టుతో పాటు అండర్-19కు ప్రాతినిధ్యం వహించిన ప్లేయర్లు ఉన్నారు. అమ్మాయిల శిక్షణకు అవసరమైన సౌకర్యాలు, పౌష్టిక ఆహారం విషయంలో ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తున్నది. రానున్న భవిష్యత్‌లో కమ్మదనం ప్రభుత్వ అకాడమీ నుంచి మరింతమంది టీమ్ఇండియాకు ఆడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం..
రంగారెడ్డి, మార్చి 23, (నమస్తే తెలంగాణ): గురుకుల విద్యార్థులు చదువుల్లోనే కాదు క్రీడల్లోనూ తమదైన ప్రతిభ కనబరుస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారు. తాము ఎంచుకున్న క్రీడలో సత్తాచాటుతూ పతకాల పంట పండిస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు క్రికెట్లో అంచనాలకు మించి రాణిస్తున్నారు. అబ్బాయిలకు తాము ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తూ సంచలనాలు సృష్టిస్తున్నారు. క్రీడల ప్రాధాన్యానికి తగిన గుర్తింపునిస్తూ ప్రభుత్వం అమ్మాయిల కోసం ఫరూఖ్‌నగర్ మండలం కమ్మదనంలో, మొయినాబాద్ మండలం చిలుకూరులో అబ్బాయిలకు ప్రత్యేక క్రికెట్ అకాడమీలు నెలకొల్పింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో శిక్షణనిస్తూ మెరికల్లాంటి క్రికెటర్లను తయారు చేస్తున్నారు. 2018లో మొదలైన ఈ అకాడమీలో శిక్షణ పొందిన అంజలి ఇప్పటికే జాతీయ సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించగా, నలుగురు అండర్-19 టోర్నీలో ఆడారు. రానున్న భవిష్యత్‌లో మరింత మంది క్రికెటర్లు కమ్మదనం క్రికెట్ కేంద్రం నుంచి రాబోతున్నారు.
కమ్మదనంలో శిక్షణ ఇలా..
కమ్మదనం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల క్రికెట్ అకాడమీలో ప్రతీ ఏడాది 50 మందికి శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్రంలోని వేర్వేరు గురుకులాల నుంచి ఆసక్తి ఉన్న ప్లేయర్లను గుర్తించి శిక్షణకు ఎంపిక చేస్తున్నారు. ట్రైనింగ్‌కు సంబంధించి మూడు స్థాయిల్లో ప్రక్రియ నిర్వహిస్తున్నారు. తొలుత పాఠశాల స్థాయిలో ప్రీలిమినరీ పరీక్ష, తర్వాత కోచ్ స్థాయిలో ఎంపిక అయితే ఆఖరిగా హెచ్‌సీఏ ఆధ్వర్యంలో తుది ఎంపిక చేస్తారు. ఇలా స్థానిక రంగారెడ్డి జిల్లాతో పాటు మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్ తదితర జిల్లాల ఉంచి అమ్మాయిలు ప్రస్తుతం కమ్మదనంలో అత్యుత్తమ శిక్షణ పొందుతున్నారు. ఉదయం 5 గంటల నుంచి 8 వరకు, సాయంత్రం 3.30 నుంచి 5.30 వరకు ట్రైనింగ్ ఇస్తున్నారు. రోజుకు ఒక్కో విద్యార్థికి డైట్ కింద రూ.125 ఖర్చు చేస్తున్నారు. అంతేగాకుండా జెర్సీలు, కిట్స్, తదితర సామగ్రిని ప్రభుత్వమే ఉచితంగా సమకూరుస్తున్నది. ఇలా ఒక్కో ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తున్నది. గత నాలుగేండ్లుగా ఇక్కడ దాదాపు 300 మంది శిక్షణ తీసుకున్నారు.
భారత జట్టులో చోటు..
కమ్మదనం క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న అమ్మాయిలు జాతీయ స్థాయి, అండర్-19 విభాగాల్లో రాణిస్తున్నారు. ఇక్కడే తర్ఫీదు పొందిన అంజలి రెండేండ్ల క్రితం భారత జట్టుకు ఎంపికై బ్యాటింగ్‌లో రాణిస్తున్నది. అదే విధంగా ఇక్కడే క్రికెట్లో ఓనమాలు దిద్దిన కృష్ణవేణి, నవ్య, అంజలి ముగ్గురు అండర్-19 టోర్నీలో ప్రాతినిధ్యం వహించారు. వీరికి ఒక్కో మ్యాచ్‌కు రూ.45 వేలను ఆయా మేనేజ్మెంట్లు చెల్లిస్తున్నాయి.
తొమ్మిదో తరగతి నుంచి శిక్షణ తీసుకుంటున్నా…
నేను గత నాలుగేండ్లుగా ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నాను. తొమ్మిదో తరగతిలో ఇక్కడ చేరా. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం, మ్యాచ్‌లు చూడడంతోపాటు ఆడటం కూడా ఇష్టం. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నా. మాలాంటి పేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణనిస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు. -సోహ్య
భారత్ జట్టులో చోటే లక్ష్యం..
2018 నుంచి ఈ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నా. అనుభవం కలిగిన కోచ్‌తో తర్ఫీదు ఇస్తున్నారు. నేను ఇప్పటివరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరపున గ్వాలియర్‌లో సౌత్‌జోన్ తరపున ఆడా. భారత జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా కష్టపడుతున్నా.
– కృష్ణవేణి
ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం..
అమ్మాయిల క్రికెట్ అకాడమీకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తున్నది. క్రికెట్‌పై ఆసక్తి, ప్రతిభను బట్టి ప్రతీ ఏటా 50 మంది విద్యార్థులను ఎంపిక చేస్తున్నాము. అన్ని జిల్లాల నుంచి క్రికెట్ అకాడమీలో చేరేందుకు గాను ప్రతీ ఏటా ఎంపికకు చాలా మంది విద్యార్థులు వస్తున్నారు. సెలక్షన్స్‌లో ప్రతిభ కనబర్చిన వారిని హెచ్‌సీఏ ఆధ్వర్యంలో ఎంపిక చేస్తున్నాం. క్రికెట్ శిక్షణతోపాటు విద్యార్థులకు అవసరమయ్యే అన్ని వసతులకు ప్రభుత్వం ప్రతీ ఏటా రూ.కోటి వరకు ఖర్చు చేస్తున్నది. ఇక్కడ శిక్షణ పొందిన అమ్మాయిలు భారత జట్టుకు ఎంపికై, ఆడుతుండడం చాలా గర్వంగా ఉంది.
– విద్యుల్లత, ప్రిన్సిపాల్, సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల, కమ్మదనం