చండ్రుగొండ, అక్టోబర్ 3 : భద్రాద్రి జిల్లాలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. చెత్తాచెదారం కూడా పేరుకుపోవడంతో అపరిశుభ్రత నెలకొన్నది. దోమలు, పాములు, తేళ్లు వస్తున్నాయని.. పిచ్చిమొక్కలు, చెత్తను తొలగించాలని ప్రధానోపాధ్యాయుడు పంచాయతీ అధికారులు, సిబ్బందికి పలుమార్లు తెలిపినా పట్టించుకోలేదు. దీంతో పాఠశాల హెచ్ఎం స్వయంగా రంగంలోకి దిగి ఆవరణను శుభ్రం చేశారు.
వివరాలు ఇలా.. ఇటీవల కురిసిన వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ అంబేద్కర్ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. చెత్తను తొలగించాలని పాఠశాల హెచ్ఎం ఎన్ వెంకటేశ్వరరావు పంచాయతీ అధికారులు, సిబ్బందికి పలుమార్లు తెలిపినా పట్టించుకోలేదు. చేసేదేమీ లేక.. ప్రధానోపాధ్యాయుడు కలుపు మొక్కల నివారణ కోసం శనివారం పంపు తీసుకొచ్చి స్వయంగా మందు పిచికారీ చేశారు.
చెత్తాచెదారం ఎండిపోయిన తర్వాత తొలగించాలని నిర్ణయించారు. హెచ్ఎం కలుపు నివారణ మందు పిచికారీ చేస్తుండగా కొందరు యువకులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారింది. గ్రామస్తులు ఆయన చొరవను అభినందించారు. అదే సమయంలో పంచాయతీ పాలకవర్గం తీరుపై మండిపడ్డారు. ఈ క్రమంలో పంచాయతీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి బెదిరింపులకు దిగినట్టు సమాచారం.