శాన్ఫ్రాన్సిస్కో: స్విగ్గీలో ఆర్డర్ పెట్టాలంటే గూగుల్ మ్యాప్స్.. క్యాబులో ఆఫీసుకు వెళ్లాలంటే గూగుల్ మ్యాప్స్.. తెలియని ప్రాంతాల్లో అడ్రస్ వెతకాలంటే గూగుల్ మ్యాప్స్.. ఎవరికైనా అడ్రస్ చెప్పాలంటే గూగుల్ మ్యాప్స్.. ఇంట్లో ఉన్నా.. కాలు బయటపెట్టినా గూగుల్ మ్యాప్స్.. ప్రజల దైనందిన జీవితంలో గూగుల్ మ్యాప్స్ అంతగా అంతర్భాగం అయింది. అలాంటి గూగుల్ మ్యాప్స్ ఒక్కసారిగా పనిచేయడం ఆగిపోతే? మ్యాపులు కనిపించకపోతే? అలాంటి ఊహే ఎప్పుడూ రాలేదు కదా. కానీ శుక్రవారం రాత్రి ప్రపంచవ్యాప్తంగా గూగుల్ మ్యాప్స్ సేవలు నిలిచిపోయాయి.
కొన్ని ప్రాంతాల మ్యాపులు మాయం అయ్యాయి. మిగతా మ్యాపులు ఉన్నా లొకేషన్లు కనిపించలేదు. రాత్రి 9 గంటల నుంచి శనివారం ఉదయం దాకా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఇబ్బందులు పడ్డారు. గూగుల్ మ్యాప్స్ సాయంతో పనిచేస్తున్న సంస్థలు, ఉద్యోగులు ‘దిక్కులు తెలియక’ తల్లడిల్లారు. గూగుల్ మ్యాప్స్‌పైనే ఆధారపడి పనిచేస్తున్న ఫోన్ యాప్‌లన్నీ ఆగిపోయాయి.
శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి శనివారం తెల్లవారుజామున 3 గంటల వరకు గూగుల్ మ్యాప్స్ పనిచేయలేదని డౌన్‌డిటెక్టర్ వెల్లడించింది. వెబ్సైట్ సాధారణంగానే లోడ్ అయినప్పటికీ మ్యాప్స్, మ్యాప్స్పై లొకేషన్లు కనిపించలేదని లక్షలాది మంది గూగుల్‌కు రిపోర్టు చేశారు. ఉన్న పళంగా లొకేషన్ మాయమైనట్టు తెలిపారు. శనివారం తెల్లవారుజామున సేవలను పునరుద్ధరించారు. గూగుల్ మ్యాప్స్ సేవలు నిలిచిపోవడంపై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ వెల్లువెత్తాయి. కాగా, గూగుల్ మ్యాప్స్ సేవల అంతరాయానికి కారణం ఏమిటన్నది తెలియలేదు.