
న్యూఢిల్లీ, జనవరి 27: గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు భారీగా తగ్గాయి. త్వరలో వడ్డీరేట్ల పెంచనున్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వు ప్రకటించడంతోపాటు ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులతో అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో ఒక్కసారిగా అలజడి నెలకొన్నది. ఫలితంగా ఔన్స్ గోల్డ్ ధర 1,845 డాలర్ల నుంచి 1,810 డాలర్లకు పడిపోవడంతో దేశవ్యాప్తంగా ధరలు దిగొచ్చాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో తులం బంగారం ధర రూ.560 తగ్గి రూ.48,210కి దిగొచ్చింది. అంతకుముందు రోజు ధర రూ.48,770గా ఉన్నది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ళు నిలిచిపోవడంతో కిలో వెండి ధర ఏకంగా రూ.1,180 తగ్గింది. బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి వెండి ధర రూ.62,790 వద్ద నిలిచింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.460 తగ్గి రూ.49,640కి, 22 క్యారెట్ల ధర రూ.400 దిగొచ్చి రూ.45,500 వద్దకు చేరుకున్నాయి.
అటు వెండి కూడా రూ.800 తగ్గి రూ.67,700 వద్దకు చేరుకున్నది.