Goat Movie | ఉగాది కానుకగా విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విభిన్న ఫలితాలను అందుకున్నాయి. ఒకటి భారీ విజయాన్ని సాధిస్తే, మరొకటి ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని మరికొన్ని సినిమాలు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. అయితే ఈ రేసులో ఉండాల్సిన ‘గోట్’ సినిమా వాయిదా పడటం చర్చనీయాంశం అయింది. సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా నటించిన గోట్ చిత్రాన్ని దర్శకుడు వేదవ్యాస్ తెరకెక్కించగా, ఎమ్ చంద్రశేఖర్ నిర్మించారు. చాలా కాలంగా షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా, డైరెక్టర్ నరేష్ కుప్పిలి మరియు నిర్మాతల మధ్య ఏర్పడిన విభేదాల కారణంగా ఆలస్యమైంది.
అన్ని అడ్డంకులను దాటుకుని మార్చి 26న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం, ఇప్పుడు పోస్ట్-ప్రొడక్షన్ దశలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా పడింది. బెటర్ క్వాలిటీతో సినిమాను అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని మేకర్స్ తెలిపారు. ఏప్రిల్ 6న ట్రైలర్ విడుదల చేసి, అదే రోజు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఇక బ్యాండ్ మేళం చిత్రం మాత్రం శ్రీరామనవమి సందర్భంగా మార్చి 26న థియేటర్లలోకి రానుంది. హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన ఈ సినిమాను సతీశ్ జవ్వాజీ దర్శకత్వంలో కోన వెంకట్ నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి ట్రైలర్ లాంచ్ చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేయడం సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చింది.
మరోవైపు సంగీత దర్శకుడు-నటుడు జీవీ ప్రకాశ్ కుమార్, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన హ్యాపీ రాజ్ చిత్రం మార్చి 27న విడుదల కానుంది. మరియా రాజా ఎలాంచెళియన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ‘ప్రేమదేశం’ ఫేమ్ అబ్బాస్ రీఎంట్రీ ఇవ్వడం విశేషం.ఇక ప్రియదర్శి, ద్రిషిక చందర్ జంటగా నటించిన సుయోధన చిత్రం సైకాలజికల్ థ్రిల్లర్గా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. మాధవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయికుమార్, ప్రేమ కీలక పాత్రలు పోషించారు. అదేవిధంగా, తమిళ నటుడు కరుణాస్ కుమారుడు కెన్ కరుణాస్ దర్శకత్వంలో రూపొందిన ‘యూత్’ అనే తమిళ్ డబ్బింగ్ మూవీ మార్చి 26న తెలుగులో విడుదల కానుంది. దేవదర్శిని, సురాజ్ వెంజరమూడు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.