ఆ ధగధగల ముందు వజ్రాలు కూడా చిన్నబోవాల్సిందే. స్వర్ణాభరణాల నుంచి వెండి నగల వరకూ.. ఎందులో అయినా ఒద్దికగా ఇమిడిపోవడం స్వరోస్కీ ప్రత్యేకత. పేరుకు గాజు ముక్కలే అయినా, మగువలకు మహా మక్కువ. ధర కూడా తక్కువే!
‘ప్రతి ఒక్కరికీ ఓ వజ్రం (ఎ డైమండ్ ఫర్ ఎవ్రీవన్)’ అన్న నినాదంతో డానియల్ స్వరోస్కీ అనే ఆవిష్కర్త గాజు ముక్కలకు వజ్రపు సొబగులద్దాడు. ఈ నగల ప్రస్థానం మొదలై దాదాపు 125 సంవత్సరాలు. గాజును భిన్నంగా కత్తిరించి ఎన్నెన్నో అందాలను సృష్టించవచ్చని కనుగొన్నాడు స్వరోస్కీ. ఎలక్ట్రికల్ మిర్రర్ కటింగ్‌కు పేటెంట్ తీసుకుని శతాబ్ద కాలం నుంచీ అందమైన నగలను, అలంకరణ వస్తువులను రూపొందిస్తున్నారు ఆయన వారసులు. ప్రత్యేకమైన కత్తిరింపుతో మామూలు గాజునూ వజ్రంలా మెరిపిస్తూ సామాన్యులకు సైతం ధగధగల నగలను అందుబాటులోకి తెచ్చాడా పెద్ద మనిషి. గాజు వస్తువుల తయారీలో మిగిలిపోయే ముక్కలను క్రిస్టల్స్‌లా తీర్చిదిద్దడం ఈ కళ ప్రత్యేకత.
లోహం ఏదైనా..
స్వరోస్కీ ఆభరణాల్లో లోహం కంటే క్రిస్టల్స్ హవా ఎక్కువ. అందుకే బంగారం, వెండి, ప్లాటినం తదితర ఖరీదైన లోహాలతోపాటు వన్‌గ్రామ్ గోల్డ్ వంటి గిల్ట్ నగలకూ ఈ క్రిస్టల్స్ మెరుపు జోడిస్తున్నారు. దుస్తులు, చేతి గడియారాల్లోనూ పొదుగుతున్నారు. ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా పెండ్లి లెహంగాలో వజ్రాలతోపాటు స్వరోస్కీ క్రిస్టల్స్ కూడా జోడించారు. గాజుతో మలచిన క్రిస్టల్స్ పారదర్శకంగా ఉంటాయి. కాంతి కిరణాలు పడగానే మెరిసిపోతాయి. అందుకే, వీటిని మహిళలు రాత్రిళ్లు ఎక్కువగా ధరిస్తారు. కొన్నిరకాల జాతిరాళ్లు, రంగు రాళ్లనూ క్రిస్టల్స్‌గా మార్చి ఆభరణాలు తయారు చేస్తున్నారు.
ధర తక్కువ..
డైమండ్ కట్స్‌తో రూపొందే స్వరోస్కీ ఆభరణాలు అందంలోనూ, ఆకర్షణలోనూ వజ్రాలకు ఏమాత్రం తీసిపోవు. సంప్రదాయ వేడుకల్లో నిండుగా కనిపించేందుకు ఇవి చక్కని ఎంపిక. అందుబాటు ధరలో, ఆకర్షణీయమైన డిజైన్లతో ఆధునిక మహిళల మనసు దోచేస్తున్నాయీ అద్దాల నగలు. చీరకట్టుపై ధరించే భారీ ఆభరణాల నుంచి వెస్ట్రన్వేర్పై నప్పే ఆధునిక నగలవరకూ అన్ని డిజైన్లూ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ైస్టెలిష్ లుక్ ఇచ్చే బ్రేస్లెట్లు, హ్యాంగింగ్స్, పెండెంట్స్, చోకర్లు, ఒకే డిజైన్‌తో లభించే కాంబోలు.. అతివలను ఆకట్టుకుంటున్నాయి.