Mother’s Day 2022 | జన్మనిచ్చిన అమ్మకు ఏమిచ్చినా తక్కువే. ఉగ్గుపాలతో విలువలు రంగరించిన తల్లి ముందు ఎంత విలువైన బహుమతి అయినా చిన్నబోవాల్సిందే. అలా అని, ‘మదర్స్ డే’ నాడు ఖాళీ చేతులతో శుభాకాంక్షలు చెబుతామా? పుష్పమో, పత్రమో అన్నట్టు.. ప్రేమగా ఏదో ఒక కానుక ఇవ్వాలి. అది తెల్ల గులాబీల పుష్పగుచ్ఛం కావచ్చు, బెల్లం జిలేబీల డబ్బా కావచ్చు. అంతకుమించి కూడా ఆలోచించవచ్చు..
భర్త, పిల్లలు, అత్తామామలు, అమ్మానాన్నలు.. అందరి మంచినీ కోరుకునే అమ్మ తన ఆరోగ్యాన్ని మాత్రం పట్టించుకోదు. తరచూ కళ్లు తిరుగుతాయని అంటుంది కానీ బీపీ చెక్ చేయించుకోదు. లావైపోతున్నట్టు గుర్తిస్తుంది కానీ బరువు తూచుకోదు. అదంతా కాదు కానీ, ఈసారి మదర్స్‌డే కానుకగా మంచి ల్యాబ్‌లో కంప్లీట్ బాడీ చెకప్ బుక్ చేయండి. కొన్ని సంస్థలు అమ్మలకు ప్రత్యేక డిస్కౌంట్ కూడా ఇస్తున్నాయి.
అమ్మకు డబ్బంటే మక్కువ లేదు. ఏ బోనస్ వచ్చినప్పుడో పిల్లలు ఒక పదివేలు చేతిలో పెట్టినా తీసుకోదు? ‘నేనేం చేసుకుంటాను? నా అవసరాలు చూసుకోవడానికి మీరున్నారు కదా’ అని తప్పించుకుంటుంది. ఈసారి మరో మార్గంలో ప్రయత్నించండి. నెలనెలా అమ్మ పేరు మీద ‘సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్’ ప్రారంభించండి. మార్కెట్ లాభాలబాట పట్టేకొద్దీ యూనిట్స్ విలువ పెరుగుతుంది. ఏదో ఓ సమయంలో ఆ మొత్తం అమ్మకు తప్పకుండా పనికొస్తుంది.
అమ్మకు నగల మీద మోజే లేదు. నిరాడంబరతను ఇష్టపడుతుంది. పిల్లలంతా కలిసి మంచి డైమండ్ నెక్లెస్ చేయించినా.. ఊళ్లో ఒంటరిగా ఉంటుంది కాబట్టి, భద్రత కూడా ఓ సమస్యే. డబ్బు కోసం ఎంతకైనా తెగబడుతున్నాయి కొన్ని ముఠాలు. మార్కెట్లో దొరికే బంగారం నాణ్యత విషయంలోనూ అనేక సందేహాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇ-గోల్డ్ మంచి ప్రత్యామ్నాయం. దీనివల్ల భద్రతకు ఢోకాలేదు. బంగారం ధరతోపాటే విలువ కూడా పెరుగుతుంది. నగలు చేయించుకునే ఆలోచన వచ్చినప్పుడు.. అసలు సిసలు బంగారం కొనుక్కోవచ్చు.
లోకమంతా మారుతున్నా అమ్మ మాత్రం మారదు. తనెప్పుడూ డబ్బు మనిషి కాలేదు. అయినా సరే.. తన పేరు మీద సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అకౌంట్ ప్రారంభించండి. ఈ పథకం వ్యవధి ఐదేండ్లు. సాలీనా ఏడున్నర శాతం వడ్డీ వస్తుంది. అత్యంత సురక్షితం. ‘ప్రధానమంత్రి వయా వందన యోజన’ కూడా తిరుగులేని పథకమే. పదేండ్ల సమయంలో నెలనెలా వడ్డీ వస్తుంది. చిన్నచిన్న ఖర్చులకు సరిపోతుంది. అసలే అమ్మకు ఆత్మాభిమానం. నోరు తెరిచి ఏమీ అడగదు.
ఓ లక్ష రూపాయలు పొదుపు-మదుపు చేస్తాం. ఫలితంగా వడ్డీ లేదా రాబడి వస్తుంది. ఇదంతా ఆర్థికపరమైన వ్యవహారం. ఉద్వేగపరమైన పెట్టుబడులూ కొన్ని ఉన్నాయి. వాటికి వడ్డీలు, లాభాలు ఉండవు. కానీ అపారమైన ఆనందం, సంతృప్తి లభిస్తాయి. ఓ సెలవు రోజు చూసుకుని అమ్మను విమానంలో ఎక్కడికైనా తీసుకెళ్లండి. పెండ్లి తర్వాత కుటుంబమే ఆమె ప్రపంచం అయిపోయింది. పుట్టింటి బంధువులను చూడాలని ఉందేమో కనుక్కోండి. తనకు ఇష్టమైన చీరలేమిటో తెలుసుకోండి. వీడియో కాల్ చేసి బాల్య స్నేహితులతో మాట్లాడించండి. తనకు ఇష్టమైన పాత పాటలతో ‘కారవాన్ రేడియో’ కానుకగా ఇవ్వండి. ఒకటా రెండా మనసుంటే మార్గాలెన్నో. అమ్మ అల్ప సంతోషి. చిన్న ప్రయత్నాలకే పొంగిపోతుంది!
“మాతృదినోత్సవానికి ఆర్టీసీ కానుక.. అమ్మలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం”
“Mother’s Day : అమ్మ కోసం నెదర్లాండ్‌లో ఇద్దరు భారతీయ యువతుల పోరాటం”
Mother’s Day Special : అమ్మ కడుపు చల్లగా
Mother’s day special: అమ్మ కోసం ఐదు బహుమతులు