e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News దళపతి నలభై ఏండ్ల సైనిక జీవితం

దళపతి నలభై ఏండ్ల సైనిక జీవితం

  • చివరి శ్వాస దాకా దేశ రక్షణకే అంకితం.. తండ్రి అడుగుజాడల్లో ఆర్మీలోకి రావత్‌
  • అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నత స్థాయికి.. దేశానికి మొదటి సీడీఎస్‌గా నియామకం
  • కశ్మీర్‌, ఈశాన్యంలో తీవ్రవాద కట్టడి.. సర్జికల్‌ స్ట్రైక్స్‌తో పాక్‌కు బుద్ధి చెప్పడం
  • సరిహద్దుల్లో చైనాను నిలువరించడం.. బిపిన్‌ రావత్‌ జీవితం స్ఫూర్తిదాయకం

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 8: బిపిన్‌ రావత్‌ 1958 మార్చి 16న ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లాలో రాజపుత్రుల కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి లక్ష్మణ్‌ సింగ్‌ రావత్‌ సైన్యంలో లెఫ్టినెంట్‌ జనరల్‌ హోదాలో వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా పనిచేశారు. రావత్‌ పాఠశాల విద్య డెహ్రాడూన్‌లోని కేంబ్రియన్‌ హాల్‌ స్కూల్‌, సిమ్లాలోని సెయిండ్‌ ఎడ్వర్డ్స్‌ స్కూల్‌లో పూర్తైంది. తండ్రి స్ఫూర్తితో, సైన్యంలోకి వెళ్లాలన్న లక్ష్యంతో రావత్‌ నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో చేరారు. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజ్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌, అమెరికాలో ఆర్మీ కమాండ్‌ అండ్‌ జనరల్‌ స్టాఫ్‌ కాలేజీ నుంచి హయ్యర్‌ కమాండ్‌ కోర్సు పూర్తి చేశారు. 2011లో చౌదరీ చరణ్‌ సింగ్‌ వర్సిటీ నుంచి మిలిటరీ మీడియా,స్ట్రాటజిక్‌ స్టడీస్‌పై పీహెచ్‌డీ చేశారు.

మిలిటరీ కెరీర్‌

బిపిన్‌ రావత్‌ 1978 డిసెంబర్‌ 16న 11 గూర్ఖా రైఫిల్స్‌ 5వ బెటాలియన్‌లో సెకండ్‌ లెఫ్టినెంట్‌గా సైన్యంలో కెరీర్‌ను ప్రారంభించారు. తండ్రి లక్ష్మణ్‌ సింగ్‌ కూడా ఇదే యూనిట్‌ నుంచి కెరీర్‌ను ప్రారంభించడం విశేషం. ఉరీ, జమ్ముకశ్మీర్‌లో మేజర్‌గా గూర్ఖా రైఫిల్స్‌ను కమాండ్‌ చేశారు. అక్కడ తీవ్రవాదం తగ్గించడంలో కృషి చేశారు. తర్వాత కర్నల్‌ స్థాయికి, అక్కడి నుంచి బ్రిగేడియర్‌ స్థాయికి ఎదిగారు. బ్రిగేడియర్‌గా సోపోర్‌లో రైఫిల్స్‌ను కమాండ్‌ చేశారు. తర్వాత డెమోక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో మల్టీ నేషనల్‌ బ్రిగేడ్‌కు సారథ్యం వహించారు. 2016లో వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా నియమితులయ్యారు. 2016 డిసెంబర్‌ 31న ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. సీనియర్‌ లెఫ్టినెంట్‌ జనరల్స్‌ ప్రవీణ్‌ బక్షీ, హరీజ్‌లను పక్కన పెట్టి మరీ రావత్‌ను నియమించడం విశేషం.

మొట్టమొదటి సీడీఎస్‌

- Advertisement -

మారుతున్న పరిస్థితులు, చైనా నుంచి భద్రతాపరమైన సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో త్రివిధ దళాలను సమన్వయం చేయడానికి భారత ప్రభుత్వం చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) పేరుతో అత్యున్నత సైనిక పదవిని సృష్టించింది. దేశానికి తొలి సీడీఎస్‌గా రావత్‌నే నియమించింది. 2019 డిసెంబర్‌ 30న బాధ్యతలు స్వీకరించారు. సీడీఎస్‌ పదవీ కాలం మూడేండ్లు. 2022 డిసెంబర్‌తో రావత్‌ పదవీ కాలం పూర్తయ్యేది. మొత్తంగా రావత్‌ నాలుగు దశాబ్దాలు సైన్యంలో సేవలందించారు. ఆయన ఫోర్‌ స్టార్‌ జనరల్‌.

1987 చైనా-ఇండియా ఘర్షణలు

1987లో అరుణాచల్‌లోని సమ్‌దోరోంగ్‌ చూ లోయలో భారత్‌-చైనా బలగాల మధ్య ఘర్షణ జరిగింది. అక్కడ రావత్‌ బెటాలియన్‌ విధుల్లో ఉంది. చైనా సైన్యాన్ని సమర్థంగా అడ్డుకొన్నది. తర్వాత 2017లో డోక్లాం ప్రతిష్టంభన సమయంలో చైనా నుంచి ఎదురవనున్న ముప్పుపై దేశాన్ని హెచ్చరించారు. ఆయన ఊహించినట్టుగానే ఇప్పుడు చైనా నుంచి భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాం.

2015లోనూ హెలికాప్టర్‌ ప్రమాదం

  • రావత్‌ 2015లో కూడా ఒకసారి హెలికాప్టర్‌ ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న చీతా హెలికాప్టర్‌ ఎగిరిన కొద్దిసేపటికే కూలిపోయింది. రావత్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
  • రావత్‌కు వచ్చిన అవార్డులు
  • పరమ విశిష్ట సేవా మెడల్‌, ఉత్తమ యుద్ధ సేవా మెడల్‌, అతి విశిష్ట సేవా మెడల్‌, విశిష్ట సేవా మెడల్‌, యుద్ధ సేవా మెడల్‌, సేనా మెడల్‌.
  • వారంలో కొత్త సీడీఎస్‌!
  • రావత్‌ మరణంతో ఖాళీగా మారిన సీడీఎస్‌ పదవిని వారం, పది రోజుల్లో కేంద్రం భర్తీ చేయనున్నట్టు సమాచారం.

సైనిక కుటుంబాల సంక్షేమానికి మధూలిక కృషి

బిపిన్‌ రావత్‌ సతీమణి మధూలిక రావత్‌ సైనికోద్యోగుల భార్యల సంక్షేమ సంఘం(ఏడబ్ల్యూడబ్ల్యూఏ) అధ్యక్షురాలిగా ఉన్నారు. సైనిక కుటుంబాల సంక్షేమం కోసం కార్యక్రమాలు నిర్వహించారు. అమర సైనికుల భార్యల(వీర నారి) సహాయార్థం సంక్షేమ, ప్రచార కార్యక్రమాలను చేపట్టారు. వారి ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేశారు. టైలరింగ్‌, కేకుల తయారీ, బ్యూటీషియన్‌ కోర్సులను నిర్వహించారు. ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీలో డిగ్రీ చేశారు. క్యాన్సర్‌ రోగుల సంక్షేమం కోసం కూడా ఆమె పనిచేశారు.

సర్జికల్‌ స్ట్రైక్స్‌లో కీలక పాత్ర

2015లో నాగాలాండ్‌లోని ధింపూర్‌లో లెఫ్టినెంట్‌ జనరల్‌ హోదాలో రావత్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మణిపూర్‌కు చెందిన యూఎన్‌ఎల్‌ఎఫ్‌డబ్ల్యూ మిలిటెంట్లు నాగాలాండ్‌లో 18 మంది భారత జవాన్లను చంపి మయన్మార్‌కు పారిపోయారు. దీనిపై రావత్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఆయన నేతృత్వం వహిస్తున్న 21వ బెటాలియన్‌ పారాచూట్‌ రెజిమెంట్‌ భారత సరిహద్దు దాటి మయన్మార్‌లోకి ప్రవేశించి సర్జికల్‌ స్ట్రైక్‌ చేసి మిలిటెంట్లను మట్టుబెట్టింది. 2016 ఉరీ ఘటన అనంతరం సర్జికల్‌ స్ట్రైక్స్‌, 2019లో బాలాకోట్‌లో ఉగ్రస్థావరాలపై సర్జికల్‌ స్ట్రైక్స్‌లో రావత్‌ కీలక పాత్ర వహించారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement