హనుమకొండ చౌరస్తా : దేశప్రజలకు స్ఫూర్తిదాయకం జెన్-జీ విద్యార్థుల ( Gen-Z Student ) ఉద్యమని పీడీఎస్‌యూ రాష్ట్ర సదస్సులో ప్రముఖ విద్యావేత్త ఐ.వి.రమణారావు( Ramana Rao) అన్నారు. శనివారం కాకతీయ యూనివర్సిటీలోని హిస్టరీ సెమినార్ హాల్లో పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘ఢిల్లీలో జెన్ -జీ విద్యార్థుల ఉద్యమం-పరిశీలన -మన కర్తవ్యం’ అనే అంశంపై నిర్వహించిన సదస్సు పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వి అధ్యక్షతన జరిగింది.
ముఖ్యఅతిథిగా పాల్గొన్న రమణారావు మాట్లాడుతూ విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వాలే కాదు, రాజ్యాలు సైతం కూలిపోతాయనేది చారిత్రక సత్యమని, ప్రపంచ దేశాల్లోని విద్యార్థి లోకం నిరూపించిందన్నారు. ఇటీవల దేశంలో నీట్ పరీక్ష పేపర్ లీకేజీని నిరసిస్తూ ఢిల్లీలో సోనమ్‌వాంగ్ చుక్, అభిజీత్ దీప్కే నేతృత్వంలో జెన్ -జీ విద్యార్థులు కొనసాగించిన పోరాటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందన్నారు.
నేటి కార్పొరేట్, పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడుతున్న శక్తులకు ఈ ఉద్యమం కొత్త ఉత్సాహాన్ని, పోరాట స్ఫూర్తిని అందించిందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్‌లైన్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబోలా అనిల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.నరసింహారావు, బి.నరేందర్, బుర్ర వీరభద్రం, రాష్ర్ట సహాయ కార్యదర్శులు డి.సురేష్, బోయినపల్లి అజయ్, రాష్ట్ర కోశాధికారి అంగిడి కుమార్, రాష్ట్ర గర్ల్స్ కో-కన్వీనర్ పి.అనూష తదితరులు పాల్గొన్నారు.