ఖైరతాబాద్, మార్చి 16: గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ (జీసీటీఎం) కేంద్రాన్ని హైదరాబాద్‌లోనే ఏర్పాటుచేయాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చొరవ తీసుకోవాలని పబ్లిక్ హెల్త్‌కేర్ కౌన్సిల్ డైరెక్టర్ జనరల్, తెలంగాణ ఆక్యుపంక్చర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పీఎస్ సాగర్ కో రారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో జీసీటీఎం సెంటర్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతున్న తరుణంలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు దీనిని తరలించేందుకు కేంద్రం ఉత్తర్వులివ్వడం దారుణమని మండిపడ్డారు. ఇప్పటికే ఫార్మాసిటీగా మారిన హైదరాబాద్‌ను కాదని, గుజరాత్‌కు తరలించడం తగదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనేంత వరకు పబ్లిక్ హెల్త్ కేర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజారోగ్య కార్యక్రమాల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతామని చెప్పారు. సమావేశంలో పబ్లిక్ హెల్త్ కేర్ కౌన్సిల్ చైర్మన్ ఇలియాజ్, వైస్ చైర్మన్ త్రివిక్రమ్, కార్యదర్శి శిరీష తదితరులు పాల్గొన్నారు.