సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): నగరంలో గంజాయి సరఫరాకు ప్రయత్నిస్తున్న ఒక ముఠాను హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ సూపరిండెంట్ ఎన్.అంజిరెడ్డి కథనం ప్రకారం.. వట్టేపల్లి ఫాతిమానగర్కు చెందిన షేక్ అజాం అలియాస్ చాంద్, బహుదూర్పురాకు చెందిన ఖదీర్ ఖురేషీలు వృత్తిరీత్యా ఆటో డ్రైవర్లు. వీరికి పూల వ్యాపారి మహ్మద్ సమద్ స్నేహితుడు. ఈ ముగ్గురు గంజాయికి అలవాటు పడ్డారు. వీరికి ధూల్పేట్లో గంజాయి దొరకకపోవడంతో ఒడిస్సాకు చెందిన సుఖాంత్ ఖారను సంప్రదించి అక్టోబర్లో 6 కిలోల గంజాయి కిలో రూ. 10 వేల చొప్పున కొనుగోలు చేశారు. తిరిగి ఈ నెల 15న మరో ఆరు కిలోలు కొనుగోలు చేశారు.
అందులో కొంత స్వయంగా ఉపయోగించి మరికొంత పది గ్రాములు రూ. 500 చొప్పున ఫలక్నుమా ప్రాంతంలో విక్రయిస్తున్నారు. ఇదిలాఉండగా జాయింట్ కమిషనర్ ఎన్ఏ అజయ్రావు ఆదేశాలతో ఎక్సైజ్ సూపరిండెంట్ పర్యవేక్షణలో సీఐ రవి, ఎస్ఐ నిజాముద్దీన్, దామోదర్, సిబ్బంది అజీమ్, ప్రకాశ్, రాకేశ్, కరణ్ సింగ్ బృందం ఫలక్నుమా ప్రాంతంలో రూట్ వాచ్ నిర్వహించింది. ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారంతో ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకొని, వారి నుంచి వద్ద 3.5 కిలోల గంజాయి, ఆటో(టీఎస్13యుఏ4597)ను స్వాధీనం చేసుకున్నారు.