హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కమీషన్లు.. ఆయన సోదరుల భూదందాల కోసమే కాంగ్రెస్ ఫ్యూచర్‌సిటీని తెరపైకి తెచ్చిందని మండలి విప్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆరోపించారు. కేసీఆర్ పాలనలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో కాంగ్రెస్ నాయకులు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రద్దుచేస్తామని హరీశ్‌రావు ప్రకటించారని స్పష్టంచేశారు. హరీశ్‌రావు ప్రకటనను యావత్ తెలంగాణ సమాజం స్వాగతిస్తున్నదని పేర్కొన్నారు. ఆయన ప్రకటనతో కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఎద్దేవాచేశారు. శనివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు రాఘవేంద్ర యాదవ్, అమృత్లాల్ చౌహాన్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కనుమరుగై అరాచకం రాజ్యమేలుతున్నదని ఆరోపించారు.
సీఎం రేవంత్‌రెడ్డి మెప్పు కోసమే మంత్రి శ్రీధర్‌బాబు హరీశ్‌రావుపై ఎగిరెగిరి పడుతున్నారని దేశపతి ధ్వజమెత్తారు. నాడు ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పి అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లడిగిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు శ్రీధర్‌బాబుకు తప్పుడు స్క్రిఫ్ట్ రాసిచ్చి ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దుచేసి రైతులకు భూములు తిరిగి ఇస్తామని చెప్పిన నాటి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలను గుర్తుచేసుకోవాలని చురకలంటించారు. ‘హైకోర్టు ముందు ఫార్మాసిటీని రద్దు చేయలేదని చెబుతున్నరు.. ప్రజల ముందేమో ఫ్యూచర్‌సిటీ కడుతామని ప్రగల్భాలు పలుకుతున్నరు..
ఇందులో ఏది నిజమో శ్రీధర్‌బాబు స్పష్టతనివ్వాలి’ అని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా వినాశకరంగా మాట్లాడారో గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. ‘ప్రగతిభవన్‌ను పేల్చేయాలని అనలేదా..? ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని చెప్పలేదా..? అని గుర్తుచేశారు. భూ భారతి తెచ్చి కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టింది నిజం కాదా? ఎయిర్‌పోర్టు దాకా ప్రతిపాదించిన మెట్రో ప్రాజెక్టును రద్దుచేసింది సీఎం కాదా..? హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చింది కాంగ్రెస్ సర్కార్ కాదా?’ అని ప్రశ్నల వర్షం కురిపించారు.
అభివృద్ధిని ఆపుతున్నది కాంగ్రెస్సేననే విషయాన్ని శ్రీధర్‌బాబు గ్రహించాలని సూచించారు. రెండున్నరేండ్లలో ఏం చేశారని బీఆర్ఎస్ అడ్డుకున్నది అని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్కు, హరీశ్‌రావుకు నీతులు చెప్పాల్సిన అవసరంలేదని దెప్పిపొడిచారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం కేసీఆర్ అన్నీ ఆలోచించే ఫార్మాసిటీని నెలకొల్పాలని ప్రతిపాదించారని దేశపతి గుర్తుచేశారు. రైతులను ఒప్పించి భూములను సేకరించారని స్పష్టంచేశారు. కానీ, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి కమీషన్లు, రియల్ ఎస్టేట్ దందాల కోసమే ఫ్యూచర్‌సిటీని తెరపైకి తెచ్చి ఫార్మాసిటీ రద్దు చేశారని ఆరోపించారు. ఫార్మాసిటీ అంటేనే రైతులు భూములు ఇచ్చారని, ఇప్పుడు రద్దు చేయడంతో వారే కోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు. ఫార్మాసిటీ వస్తేనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తున్నది ఫ్యూచర్‌సిటీ కాదని.. అవినీతి సిటీ అని మండిపడ్డారు. ఏది ఏమైనా తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగితే బీఆర్ఎస్ సహించబోదని పునరుద్ఘాటించారు.
హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ) : అక్రమ మైనింగ్ పేరిట ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత గోసుల శ్రీనివాస్ హెచ్చరించారు. తన తండ్రి పేరిట ఏర్పాటుచేసిన రాఘవ కన్స్ట్రక్షన్ తనది కాదని మంత్రి ప్రకటించడం సిగ్గుచేటని శనివారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతల భూ దోపిడీ కోసమే ఫ్యూచర్‌సిటీని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. ఫార్మాసిటీకి సేకరించిన భూములను ఇతర అవసరాలకు వినియోగించవద్దని తెలిసినా, స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని దుయ్యబట్టారు. రెండున్నరేండ్ల రేవంత్ పాలనలో తెలంగాణను ఉద్ధరించిందేమీలేదని విమర్శించారు.
హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఫ్యూచర్‌సిటీని రద్దు చేస్తామని హరీశ్‌రావు ప్రకటనతో కాంగ్రెస్ నేతల్లో కలవరం మొదలైందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ధ్వజమెత్తారు. అధికారమిస్తే ఫార్మాసిటీ భూము లను రైతులకు తిరిగి ఇస్తామని ప్రగల్భాలు పలికిన సీఎం రేవంత్‌రెడ్డి, ఇప్పుడు ఫ్యూచర్‌సిటీ ముసుగులో భూములు కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. కొత్త సిటీ పేరిట అవినీతి సౌధాలు పటిష్టం చేసుకొనే పనిలో నిమగ్నమైన అధికారపార్టీ నేతలు ఇప్పుడు ఉలికిపాటుకు గురవుతున్నారని విమర్శించారు.
ఫార్మాసిటీ భూములను ఇతర అవసరాలకు వినియోగించవద్దనే ప్రాథమిక సూత్రం తెలియని పొంగులేటి, మంత్రి కావడం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యమని ఎద్దేవా చేశారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని అక్రమ మైనింగ్‌తో అడ్డగోలుగా ప్రజాధనాన్ని లూటీ చేసిన ఘనుడని దుయ్యబట్టారు. హైదరాబాద్ మెట్రోపై అవగాహన లేని ఆయన, అడ్డదిడ్డంగా మాట్లాడడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు రాష్ట్రాన్ని ముక్కలుగా చేసి పంచుకుంటున్నారని మండిపడ్డారు. అధికారం పోయాక పొంగులేటి అవినీతి సౌధం పేకమేడలా కుప్పకూలడం ఖాయమని హెచ్చరించారు.