Khamenei : అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel) దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ (Iran Supreme Leader) అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) మరణించడం సంచలనం సృష్టించింది. కొన్నేళ్లుగా సుప్రీంలీడర్‌ను తమ టార్గెట్‌లో పెట్టుకొన్న ఇజ్రాయెల్.. ఆయన కదలికలను పసిగట్టేందుకు ఇరాన్ (Iran) లోని ట్రాఫిక్ కెమెరా నెట్వర్క్, మొబైల్ ఫోన్ సిస్టమ్స్‌ను హ్యాక్ చేసింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
ఇరాన్ రాజధాని నగరం టెహ్రాన్‌లోని అన్ని ట్రాఫిక్ కెమెరాలు ఏళ్లపాటు హ్యాకింగ్‌కు గురయ్యాయని ఇజ్రాయెల్ నిఘా విభాగంలో పనిచేసిన అధికారులు వెల్లడి చేశారు. ఆ ఫుటేజీని ఎప్పటికప్పుడు ఎన్‌క్రిప్ట్ చేసి, స్వదేశానికి తెప్పించుకున్నట్లు వారు తెలిపారు. అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. ఖమేనీ వ్యక్తిగత భద్రతాసిబ్బంది తమ వాహనాలను పార్కింగ్ చేసే ప్రదేశాలను, టెహ్రాన్‌లోని పెస్టర్ స్ట్రీట్ సమీపంలోని సుప్రీంలీడర్‌కు చెందిన కాంపౌండ్‌లో రోజూవారీ కార్యకలాపాలను నెతన్యాహు ప్రభుత్వం ఒక కెమెరా యాంగిల్ ద్వారా గుర్తించింది.
ఖమేనీ ఎక్కడ ఉంటారు..? ఎవరిని కలుస్తున్నారు..? ఇతరులతో ఎలా కమ్యూనికేట్ అవుతారు..? తన ప్రాణానికి ఏదైనా హాని ఉంటే ఎక్కడికి వెళ్తారు..? ఇలా ప్రతి విషయాన్ని అమెరికా, ఇజ్రాయెల్ నిఘా వర్గాలు సునిశితంగా అధ్యయనం చేశాయి. ఆయనతో సమావేశమయ్యే రాజకీయ నాయకులను, మిలిటరీ ఉన్నతాధికారులను కూడా ట్రాక్ చేశారు. ‘మాకు జెరూసలెం గురించి ఎంత తెలుసో.. టెహ్రాన్ గురించి కూడా అంతే బాగా తెలుసు’ అని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు పేర్కొనడాన్ని బట్టి వాళ్లు ఇరాన్‌పై ఎంత నిఘా పెట్టారో అర్థం చేసుకోవచ్చు.
ఎప్పటికప్పుడు సేకరించిన సమాచారాన్ని ఒక క్రమంలోకి తీసుకువచ్చేందుకు ఇజ్రాయెల్ ఏఐ టూల్స్‌ను, అల్గారిథమ్స్‌ను ఉపయోగించింది. ఫిబ్రవరి 28న కూడా అత్యంత కచ్చితత్వంతో ఖమేనీని టార్గెట్ చేయడానికి ఈ డేటానే ఉపయోగించింది. ఇరాన్లో ప్రతి శుక్రవారం ప్రభుత్వ సెలవుదినం. శనివారం వారం ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో ఖమేనీ ప్రతి వారం ప్రారంభం రోజున తన అధికారిక నివాసంలో ప్రభుత్వ పెద్దలు, సైనిక ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించేవారు. ఇది తెలుసుకున్న ఇజ్రాయెల్, అమెరికా నిఘా వర్గాలు మళ్లీ సమావేశం ఎప్పుడు జరుగుతుంది అనే దానిపై దృష్టిపెట్టారు.
ఈ క్రమంలో టెహ్రాన్ నగర నడిబొడ్డులోని ఒక ప్రభుత్వ ప్రాంగణంలో ఇరాన్ అత్యున్నత స్థాయి అధికారుల సమావేశం ఉంటుందని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈ విషయాన్ని తెలుసుకోవడంలో అమెరికా నిఘా సంస్థ సీఐఏ ఇచ్చిన సమాచారం కూడా కీలకంగా మారింది. సమావేశం జరిగే ప్రదేశాన్ని తెలుసుకున్న అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఒక్కసారిగా ఆకస్మికంగా దాడిచేసి ఖమేనిని, అతనితోపాటు అతని కుటుంబంలో కొందరిని చంపేశాయి.