Manushi Chhillar | మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ తన విద్యార్థి దశలో నీట్ పేపర్ లీక్ అవ్వడం వలన పడ్డ కష్టాలను గుర్తుచేసుకుంటూ ఆసక్తికర విషయాలను పంచుకుంది. సోహా అలీ ఖాన్ నిర్వహించిన ‘ఆల్ అబౌట్ హర్’ యూట్యూబ్ టాక్ షోలో పాల్గొన్న ఆమె, 2015 నాటి వైద్య ప్రవేశ పరీక్ష (నీట్) పేపర్ లీక్ ఉదంతం తనపై ఎంత తీవ్రమైన మానసిక ప్రభావాన్ని చూపిందో వివరించారు. ఎంతో కష్టపడి ప్రిపేర్ అయిన తర్వాత పరీక్ష రద్దు కావడం, మళ్లీ రాయాల్సి రావడం తన జీవితంలోనే అత్యంత కఠినమైన కాలమని ఆమె తెలిపారు. వైద్య వృత్తిపై మక్కువతో తాను ఎంతో ఇష్టపడే కూచిపూడి నృత్యం, పెయింటింగ్ వంటి వాటిని ఒక సంవత్సర కాలం పాటు పూర్తిగా పక్కన పెట్టానని, తన సంతోషాలన్నింటినీ త్యాగం చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లు కావడంతో మానసికంగా తనకు ఎంతో అండగా నిలిచారని, అయితే సాధారణ విద్యార్థులు పడే ఇబ్బందులను తాను ప్రత్యక్షంగా చూశానని మానుషి వెల్లడించారు. ఎంతోమంది విద్యార్థులు కోచింగ్ కోసం అప్పులు చేసి, వేరే నగరాలకు వెళ్లి చదువుకుంటున్నారని, అలాంటి సమయంలో పరీక్ష మళ్లీ రాయాల్సి రావడం వల్ల విద్యార్థులు ఎంతటి మానసిక ఒత్తిడికి గురవుతారో మాటల్లో చెప్పలేమని అన్నారు. పరీక్ష తేదీ పొడిగించిన ఆ 45 రోజులు మరింత కష్టంగా మారిందని, ఇంకెంత శక్తి మిగిలి ఉందో అనిపించేదని ఆమె గుర్తుచేసుకున్నారు. అయితే తన తల్లిదండ్రులు రోజుకో గంట వ్యాయామం, బాస్కెట్బాల్ ఆడటం వంటి వాటికి కేటాయించాలని చెప్పడం వల్లే తాను డిప్రెషన్లోకి వెళ్లకుండా మానసిక ప్రశాంతతను కాపాడుకోగలిగానని తెలిపారు.
ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత మిస్ వరల్డ్ 2017 కిరీటాన్ని గెలుచుకున్న మానుషి, ఆ తర్వాత అనూహ్యంగా సినిమాల్లోకి ప్రవేశించారు. ‘సమ్రాట్ పృథ్విరాజ్’ చిత్రంతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఆ తర్వాత ‘ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’, ‘ఆపరేషన్ వాలెంటైన్’ వంటి చిత్రాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు.