కీవ్: రష్యా దండయాత్ర నేపథ్యంలో వెన్నుచూపని వీరోచిత పోరాటం చేస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్నది. ‘నా దేశం, నా ప్రజల కోసం పోరాటం చేస్తాను’ అంటూ యుద్ధభూమిలోకి దూకడంపై అన్నివైపుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. జెలెన్స్కీ రాజకీయాల్లోకి రాకముందు ఒక కమెడియన్గా కెరీర్ ప్రారంభించాడు. సినిమాలు, కార్టూన్లు, టీవీ షోలను నిర్మించే క్వర్తల్95 అనే సంస్థను నెలకొల్పారు. ‘సర్వెంట్ ఆఫ్ ది పీపుల్’ టీవీ షోలో జెలెన్స్కీ ఉక్రెయిన్ అధ్యక్ష పాత్ర పోషించారు. 2018లో క్వర్తల్95 ఉద్యోగులు పార్టీ స్థాపించారు. 2019 ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలిచారు.