హనుమకొండ, సెప్టెంబర్ 29 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ సేవల నుంచి రాష్ట్ర ప్రభుత్వం మెల్లగా తప్పుకొంటున్నది. మహిళల ఉచిత ప్రయాణంతో ఆర్టీసీకి నేరుగా వచ్చే ఆదాయం తగ్గుతున్నదని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అనధికారికంగా ఈ పథకానికి కోత పెడుతున్నది. బస్సులు సరిపోక సీట్ల కోసం మహిళలు కొట్టుకుంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్టీసీ ప్రధాన రూట్లలో ఎక్స్‌ప్రెస్ బస్సులు తగ్గిస్తున్నది. డిమాండ్ ఉండే ఉమ్మడి జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ రూట్ బస్సులను భారీగా తగ్గించింది. హనుమకొండ బస్‌స్టేషన్ నుంచి ప్రతి పది నిమిషాలకు హైదరాబాద్ బస్సు సర్వీసు ఉండేది. ఇప్పుడు గంటన్నర వరకు వేచి చూస్తేగానీ ఎక్స్‌ప్రెస్ బస్సులు రావడంలేదు. ఎక్స్‌ప్రెస్ బస్సులు తగ్గించి డీలక్స్, సూపర్‌లగ్జరీ, ఏసీ బస్సులను తిప్పుతున్నారని మహిళా ప్రయాణికులు వాపోతున్నారు.
తప్పని పరిస్థితుల్లో టికెట్ తీసుకొని వెళ్తున్నామని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ రూట్లో మహాలక్ష్మి పథకం వర్తించే ఎక్స్‌ప్రెస్ బస్సులను తగ్గించాలని ఆరు నెలల క్రితమే ఆర్టీసీ నిర్ణయించింది. ఈ రూట్లలో ప్రయాణికులు తప్పనిసరిగా డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులు వినియోగించేలా చేసింది. శుక్రవారం, శనివారం హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రాలకు.. సోమవారం జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు ఎక్కువ మంది ప్రయాణిస్తారు. ఈ రోజుల్లో పూర్తిగా డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులే అందుబాటులో ఉండేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తున్నది. విమర్శలు రాకుండా ఉండేందుకు గంట, గంటన్నరకు ఒకటి చొప్పున ఎక్స్‌ప్రెస్ బస్సులు నడిపిస్తున్నది. డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులే అందుబాటులో ఉంటుండటంతో ప్రధాన రూట్లలో టికెట్ల రూపంలో ఆదాయం పెరుగుతున్నది. ఆర్టీసీ వరంగల్ రీజియన్ పరిధిలో హైదరాబాద్ రూట్లో నెలలోనే రోజుకు సగటను రూ.2 లక్షల ఆదాయం పెరిగింది. మహాలక్ష్మి పథకం సర్వీసులు తగ్గించడం వల్లే ఇది సాధ్యమైందని అధికారులే అంగీకరిస్తున్నారు.
ఎక్కువ మంది ప్రయాణించే ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సుల సంఖ్య పెంచాల్సిన ఆర్టీసీ దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. మహిళలకు ఉచిత బస్సు సర్వీసు పథకంలో కోత పెట్టేందుకు వీలైనంత వరకు ఎక్స్‌ప్రెస్ బస్సులను తగ్గించి.. ఈ పథకం వర్తించని డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులను ఎక్కువగా నడిపిస్తున్నది. ఎక్స్‌ప్రెస్ బస్సులు తగ్గితే ప్రయాణికులు డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో ప్రయాణిస్తారని, టికెట్ రూపంలో నేరుగా ఆదాయం వస్తుందని ఆర్టీసీ భావిస్తున్నది. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వేల కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉండటంతో ఆర్టీసీ సొంతంగానే ఏర్పాట్లు చేసుకుంటున్నది. జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ రూట్లో తగ్గించిన ఎక్స్‌ప్రెస్ బస్సులను ఇతర రూట్లలో తిప్పాలని నిర్ణయించింది. జనగామ-ఉప్పల్ రూట్లో 5 ఎక్స్‌ప్రెస్ బస్సులను తగ్గించి ఈ స్థానంలో డీలక్స్ బస్సులు నడుపాలని, నర్సంపేట డిపోలో సూపర్ లగ్జరీ బస్సులను పెంచాలని నిర్ణయించినట్టు తెలిసింది. హైర్ బస్సులపైనా ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించింది. నోటిఫై చేసిన రూట్లలోనే ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సు సర్వీసులు నడిపించేలా చూసుకోవాలని నిర్ణయించింది. దీంతో బస్సులు లేక, ఉన్నవి సమయానికి రాక మహిళా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.