సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ ఆర్టీఏ కార్యాలయాల్లో ఏజెంట్లతో కొంతమంది ఆర్టీఏ సిబ్బంది కుమ్మక్కై దరఖాస్తులను తీసుకొస్తున్న వారికి పరీక్ష నిర్వహించకుండానే లెర్నింగ్ లైసెన్స్లు జారీ చేస్తున్నారని ‘నమసే’్తశనివారం కథనం ప్రచురించింది. ఈ కథనంపై రవాణా శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. దళారులతోనే పనులు అవుతున్నాయని వాహనదారులు బాహటంగానే చెబుతున్న పరిస్థితి నెలకొని ఉండటంతో ఇకపై ఆర్టీఏ కార్యాలయాల్లోకి ఏజెంట్లు రాకుండా చర్యలు ప్రారంభించారు. ప్రతీ కార్యాలయం ఎంట్రీ గేట్ల వద్ద నలుగురు ఆర్టీఏ సిబ్బందిని విధుల్లో ఉంచారు. స్లాట్ ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు.
స్లాట్ లేకుండా ఆర్టీఏ కార్యాలయాల్లోకి రాకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా సోమవారం గ్రేటర్ ఆర్టీఏ కార్యాలయాల్లో కేవలం స్లాట్ ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. ఇక లెర్నింగ్ పరీక్ష కేంద్రాల్లో కెమెరాల పనితీరుపై రవాణా శాఖ ఉన్నతాధికారులు ఆరా తీశారు. ఎంతమంది లెర్నింగ్ లైసెన్స్ కోసం వస్తున్నారు? ఏ విధంగా సర్టిఫికెట్స్ జారీ చేస్తున్నారంటూ కొంతమంది ఎంవీఐ అధికారులను ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ లెర్నింగ్ టెస్ట్ హాజరుకావాలని.. వారు పరీక్షలో ఉత్తీర్ణులైతేనే లెర్నింగ్ లైసెన్స్ జారీ చేయాలని ఎంవీఐలకు ఆదేశాలిచ్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై శాఖాపరమైన చర్యలుంటాయని జేటీసీ రమేశ్ తెలిపారు.