చారకొండ/నేరేడుచర్ల, ఏప్రిల్ 2: దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా కారు కల్వర్టును ఢీకొట్టిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలం తుర్కలపల్లి సమీపంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణానికి చెందిన షేక్‌గౌస్ ఏపీలోని కడపలో ఉన్న హజ్రత్ హమీన్పీర్ దర్గాను దర్శించుకోవడానికి భార్య ఫర్హత్, కొడుకు ఇంతియాజ్‌తో కలిసి మార్చి 31న కారులో బయల్దేరారు. మార్గమధ్యంలో నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో ఉంటున్న తన అక్క సయ్యద్ సాజిదా బేగం, మేనల్లుడు రోషన్ జమీల్‌ను కూడా తీసుకెళ్లారు. శుక్రవారం దర్గాను దర్శించుకొని అదేరోజు అర్ధరాత్రి నేరేడుచర్లకు బయల్దేరారు.
శనివారం తెల్లవారుజామున నాగర్‌కర్నూల్ జిల్లా చారగొండ మండలం తుర్కలపల్లి సమీపంలోని మైసమ్మ గుడి వద్ద రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును కారు వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో షేక్ గౌస్ (45), ఫర్హత్ (40), సాజిదాబేగం (55), రోషన్ జమీల్ (25) అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. తీవ్రగాయాలైన ఇంతియాజ్‌ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. ప్రమాద సమయంలో కారును జమీల్ నడిపినట్టు సమాచారం. షేక్ గౌస్ దంపతుల మృతిపట్ల హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సంతాపం తెలిపారు.