‘పండంటి బిడ్డ పుట్టింది’ అని ఇంట్లో అందరూ సంబురపడుతున్నారు. పసిపాపను చూసి మురిసిపోతున్న ఆ తల్లి మనసులో ఆందోళన మొదలైంది. ఆలుమగలు ఇద్దరూ పనిచేస్తేనే గడిచే ఇల్లు వాళ్లది. ఇప్పుడు చంటి బిడ్డను చూసుకుంటూ.. కొలువు చేసేదెలా? కొలువుకు పోతే.. బిడ్డను చూసేదెలా? ఈ ప్రశ్నలకు సమాధానమే ‘అవేక్ష డే కేర్ సెంటర్’. పారిశ్రామికవాడల్లో పనిచేస్తున్న మహిళా కార్మికుల కోసం ఇవి పుట్టుకొచ్చాయి. అమ్మదనం వారి కుటుంబాన్ని ఆర్థికంగా కుంగదీయొద్దని, బిడ్డ కోసం ఆ తల్లి కొలువుకూ దూరం కావొద్దనే సంకల్పంతో వీటిని ప్రారంభించారు ఆంత్రప్రెన్యూర్లు ఉమా గూర్ఖా, మధు త్యాగి. మహిళా కార్మికుల పిల్లలను ఈ డే కేర్ సెంటర్లు తల్లిగా లాలిస్తుండటంతో.. ఆ అమ్మలు నిశ్చింతగా పనిచేసుకుంటున్నారు.
అంక్షల వలయంలో చిక్కుకున్న ఆమెకు అమ్మదనం ఒక వరం. అయితే, సొంతకాళ్ల మీద నిలబడాలన్న ఆమె తపనకు అదే అమ్మదనం ఆటంకంగా పరిణమిస్తున్నది. ఇంటి పని, ఆఫీస్ పని సమర్థంగా నిర్వహించే అతివలు ఎందరో.. అమ్మయ్యాక కన్నబిడ్డల కోసం కెరీర్‌ను త్యాగం చేస్తున్నారు. పిల్లల ఆలనా, పాలనా చూసుకునే క్రమంలో ఉపాధికి దూరమవుతున్నారు. సమాజం ఎంత ముందడుగు వేసినా.. పిల్లల పెంపకం బాధ్యత పూర్తిగా తల్లిదే అన్న భావన నుంచి మనవాళ్లు బయటపడటం లేదు. ఫలితంగా చాలామంది మహిళలు.. తల్లయ్యాక కెరీర్ డ్రాపవుట్స్‌గా మిగిలిపోతున్నారు. ముఖ్యంగా పరిశ్రమల్లో కార్మికులుకు, చిన్నచిన్న కొలువుల్లో ఉన్న మహిళలకు ఈ పరిస్థితి శాపంగా మారుతున్నది. పోనీ పిల్లలను డే కేర్ సెంటర్స్‌లో ఉంచుదాం అనుకుంటే.. ఆర్థికంగా భారం తప్పదు. పైగా పిల్లలను ఎలా చూసుకుంటారో తెలియదు. అందుకే ఉద్యోగాన్ని పణంగా పెట్టి పిల్లల పెంపకంలోనే నాలుగైదేండ్లు కెరీర్‌కు దూరమవుతున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు పరిష్కారంగా ఏర్పడిందే అవేక్ష డే కేర్ సెంటర్.
పరిశ్రమల్లో పనిచేసే తల్లుల కోసం ఉమ, మధు ఈ పిల్లల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కోవీ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఆంత్రప్రెన్యూర్) ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్మాల్ ఇండస్త్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ఐడీబీఐ) సహకారంతో ఇవి నడుస్తున్నాయి. ఉదయం డ్యూటీకి వెళ్తూ పిల్లలను ఇక్కడ అప్పగిస్తే చాలు.. సాయంత్రం వరకు వారి బాధ్యత అంతా డే కేర్ సెంటర్ నిర్వాహకులే చూసుకుంటారు. చెన్నైకి చెందిన ఉమా గూర్ఖా ఐఐటీ మద్రాస్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్‌లో థర్మోప్యాడ్స్ కంపెనీ స్థాపించారు. మరో ఆంత్రప్రెన్యూర్ మధు త్యాగి రిఫ్రిజిరేటర్ల తయారీ రంగంలో ఉన్నారు. వీరిద్దరి ఆలోచనలూ ఒక్కటిగా ఉండటంతో మహిళా సాధికారతకోసం తమవంతుగా ఏదైనా చేయాలని తపించారు. కోవీ ఫౌండేషన్ స్థాపనలో కీలక పాత్ర పోషించిన ఈ ఇద్దరూ పారిశ్రామికరంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఉద్యోగ ప్రయాణంలో మహిళలు మధ్యలో ఆగిపోకూడదని కోవీ ఫౌండేషన్‌కు అనుబంధంగా 2022లో అవేక్ష డే కేర్ సెంటర్లకు శ్రీకారం చుట్టారు. వీటిని వారిద్దరికి చెందిన వాళ్ల పరిశ్రమల దగ్గరే కాకుండా హైదరాబాద్ చుట్టు పక్కల పారిశ్రామికవాడల సమీపంలో 24 డే కేర్ సెంటర్లు స్థాపించి చక్కగా నిర్వహిస్తున్నారు.
తమ కంపెనీ పనుల్లో రోజంతా బిజీ బిజీగా గడిపే ఉమా గూర్ఖా, మధు త్యాగిలు అడపాదడపా డే కేర్ సెంటర్ల పర్యవేక్షణకు వెళ్తుంటారు. అక్కడి చిన్నారులతో సరదాగా కాసేపు ఆటలాడుతారు. ఆ పిల్లలను దగ్గరికి తీసుకొని, చిట్టి చిట్టి మాటలను ఆస్వాదిస్తారు. చిన్నారులను ఎలా చూసుకోవాలో కేర్టేకర్లకు సూచనలు చేస్తుంటారు. అంతేకాదు, సెంటర్లో పరిస్థితులను ఎప్పటికప్పుడూ మానిటర్ చేస్తూ… పిల్లలకు ఏ ఇబ్బందీ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న తల్లులు తమ చిన్నారులను అవేక్ష డే కేర్ సెంటర్లో హాయిగా విడిచిపెట్టి నిశ్చింతగా పనికి వెళ్తున్నారు. ఆరు నెలల పసిపాపలు మొదలుకొని ఆరేండ్ల చిన్నారుల వరకు సెంటర్లో ఉంచొచ్చు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆ పిల్లల బాధ్యత సెంటర్ల నిర్వాహకులదే. పిల్లల ఆలనాపాలనా అంతా అక్కడుండే కేర్టేకర్లు చూసుకుంటారు. ఆటలు ఆడిస్తారు, బొమ్మలు గీయిస్తారు, పాటలు పాడిస్తారు.. స్నాక్స్ ఇచ్చి హాయిగా నిద్రపుచ్చుతారు. ఆ సెంటర్లలోని గోడలన్నీ చిన్నారులకు ఇష్టమైన బొమ్మలతో నిండిపోయి ఉంటాయి. ఆడుకోవడానికి కావాల్సినన్ని బొమ్మలు అందుబాటులో ఉంటాయి. కాస్త పెద్ద పిల్లలకు అక్షరాలు, తెలుగు పద్యాలు, ఇంగ్లిష్ రైమ్స్ కూడా నేర్పిస్తారు. పంద్రాగస్టు, కృష్ణాష్టమి, వినాయకచవితి లాంటి ప్రత్యేక సందర్భాల్లో పిల్లలకు చక్కటి వేషాలు వేయించి.. సెలబ్రేషన్స్ కూడా చేస్తారు. పిల్లలను ఇక్కడ చేర్చుకునే ముందు తల్లులు పనిచేస్తున్న సంస్థ వివరాలు, ఆ సంస్థ యజమాని అనుమతి, కుటుంబసభ్యుల వివరాలు అన్నీ సేకరిస్తారు. అన్నీ సరిగ్గా ఉన్నాయని భావిస్తేనే… పిల్లల బాధ్యత తీసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరినీ డే కేర్ సెంటర్ దరిదాపుల్లోకి రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో తమ పిల్లలు భద్రంగా ఉన్నారన్న భరోసాతో ఆ తల్లులు హాయిగా పనిచేసుకుంటున్నారు.
అవేక్ష అండతో చిన్న, సన్నకారు కార్మికులు ప్రశాంతంగా పని చేసుకుంటున్నారు. పరిశ్రమల్లో పనిచేస్తున్న వారితోపాటు ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన భవన నిర్మాణ కార్మికుల పిల్లలనూ డే కేర్ సెంటర్ అక్కున చేర్చుకుంటున్నది. పిల్లల పెంపకం కోసం ఉపాధికి దూరమైతే ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతాయి. పిల్లలు కాస్త పెద్దయ్యాక అంటే ఓ మూడునాలుగేండ్ల తర్వాత మళ్లీ ఉపాధి వెతుక్కున్నా.. వెంటనే దొరుకుతుందన్న నమ్మకం లేదు. అంతేకాదు, గతంలో వాళ్లు పోగు చేసుకున్న అనుభవాన్ని కూడా పరిగణనలోకి తీసుకోరు. అవేక్ష సహకారంతో తమ పిల్లల గురించి బెంగ తీరిందని చెబుతున్నారు పలువురు మహిళా కార్మికులు. ఇప్పటివరకు కేవలం తెలంగాణకే పరిమితమైన అవేక్ష సేవలు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవాడలకు విస్తరిస్తాం అంటున్నారు ఉమా గూర్ఖా, మధు త్యాగి. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే తమ లక్ష్యం అని చెబుతున్నారు.