తిమ్మాపూర్, జూలై 14 : కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి మాజీ సర్పంచ్ బేతెల్లి సమత భర్త రాజేందర్‌రెడ్డి తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. మాజీ సర్పంచ్ సమత మీడియాతో మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధిపై నిరంతరం ప్రశ్నించడం వల్లే తమ గ్రామానికే చెందిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వ్యక్తిగత సహాయకుడు వంగల మురళీధర్‌రెడ్డి తన భర్తపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించినట్టు వాపోయింది. తమకు గ్రామంలో ఉన్న సిమెంట్ బ్రిక్స్ వద్ద సోమవారం రాత్రి బిగుళ్ల శ్రవణ్, పైడిపాల మల్లేశం మద్యం తాగడాన్ని తన భర్త ప్రశ్నించడంతో ఇరువురి మధ్య గొడవ జరిగిందని తెలిపింది. తన భర్త సెల్‌ఫోన్ పగులకొట్టడంతోపాటు దాడి చేశారని వాపోయింది.
అనంతరం ఇరువర్గాలవారు గన్నేరువరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకోగా.. రాజేందర్‌రెడ్డితోపాటు పంబాల సంపత్, కొమ్మెర ప్రశాంత్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైందని పేర్కొంది. తనపై దాడి చేయడమే గాక కేసు పెట్టడాన్ని తట్టుకోలేని రాజేందర్‌రెడ్డి మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఒంటిపై పెట్రోల్‌ను పోసుకుని నిప్పంటించుకున్నాడని, గమనించిన స్థానికులు మంటలను ఆర్పి దవాఖానకు తరలించినట్టు తెలిపింది. తన భర్త ఆత్మహత్యకు యత్నించడానికి వంగల మురళీధర్‌రెడ్డి కారణమని ఆరోపించింది.