ఎల్లారెడ్డి, మే 30: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు, రైతులకు కష్టాలు మొదలయ్యాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగి పోయారని, ప్రపంచంలోనే ఇంత విఫలమైన ముఖ్యమంత్రి మరొకరు లేరని ఎద్దేవా చేశారు. విపక్షాల నుంచి ఇన్ని తిట్లు తిన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక్కరేనన్నారు. పొద్దున లేస్తే కేసీఆర్ కుటుంబ సభ్యులను తిట్టుడు, పేగులు మెడలో వేసుకుంటా, తోలు తీస్తా, భూమిలో తొక్కుతా అంటూ వీధిరౌడీల కంటే ఘోరంగా మాట్లాడుడు సీఎం రేవంత్‌రెడ్డికే చెల్లుతుందని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో శనివారం ఎల్లారెడ్డిలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, ‘సర్’పై అవగాహన సదస్సులో వేముల మాట్లాడారు.
తెలంగాణ అస్తిత్వాన్ని, పచ్చటి రాష్ర్టాన్ని ధ్వంసం చేయడానికి ఆంధ్ర నాయకులు ఒక్కటయ్యారని, వీరందరితో చేతులు కలిపి తెలంగాణను పాత రోజులకు తీసుకెళ్దామని రేవంత్‌రెడ్డి ప్లాన్ చేస్తున్నారని వేముల మండిపడ్డారు. పద్నాలుగేండ్లు కొట్లాడి ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణను తెచ్చింది కేసీఆర్.. ఏ నాటికైనా తెలంగాణకు ఆయనే శ్రీరామ రక్ష అన్నారు. అందుకే గులాబీ సైనికులు ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.
కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణ గొంతు కోస్తున్నాయని రైతుల బావుల వద్ద మీటర్లు పెట్టేందుకు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. మోటర్లకు మీటర్లు పెడితే ఊరుకునేది లేదని, రైతుల తరఫున పోరాడతాని స్పష్టం చేశారు. రైతుల కోసం నాడు కేసీఆర్ మీటర్లు పెట్టకుండా రూ.30 వేల కోట్లు వదులుకున్నారని, కానీ నేడు రేవంత్‌రెడ్డి మోదీ అడిగిందే తడువుగా మీటర్లు పెట్టేందుకు సిద్ధమయ్యాడని నిప్పులు చెరిగారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ఒక్కటై పోయాయని, నరేంద్ర మోదీ చెప్పినట్లు రేవంత్‌రెడ్డి నడుచుకుంటున్నారని వేముల ఆరోపించారు. నాడు రైతుల ప్రయోజనాల కోసం కేసీఆర్ మీటర్లు పెట్టేందుకు ఒప్పుకోలేదని, కానీ నేడు రేవంత్‌రెడ్డి మోదీ చెప్పిన మీటర్ల నిబంధనకు తలొగ్గి రైతుల పొలాల వద్ద మీటర్లు పెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారని మండిపడ్డారు. ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. ‘రైతులకు మూడు గంటల కరెంట్ చాలు’ అని రేవంత్‌రెడ్డి గతంలో మాట్లాడిండు. మూడు గంటల కరెంట్‌తో నీ పొలం పారించి చుపిస్తావా రేవంత్‌రెడ్డి అని సవాల్ చేశారు.
అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజను కొన్నదని, కానీ నేటి కాంగ్రెస్ సర్కారు మాత్రం పంటలు కొనకుండా సతాయిస్తున్నాదని ప్రశాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. జొన్నలు కొనమని రైతులు మొత్తుకుంటే, ఎకరానికి 10 క్వింటాళ్లు మాత్రమే కొంటామని చెప్తున్నారని, మిగిలిన పంటను రైతులు ఏం చేసుకోవాలని ప్రశ్నించారు. ప్రభుత్వం మొత్తం పంట కొనకపోతే, మిగిలిన జొన్నలను కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇండ్లల్లో పోయాలని పిలుపునిచ్చారు. రైతులు పండించిన ప్రతి గింజా కొనాలని డిమాండ్ చేశారు. లేకపోతే మీ ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.
రేవంత్ ప్రభుత్వం రైతులకు యూరియా కూడా ఇవ్వలేకపోతున్నదని వేముల అన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క ఫోన్ కొడితే సొసైటీల నుంచో, షాపుల నుంచో ఆటోల్లో యూరియా నేరుగా రైతుల బావుల వద్దకు వచ్చేది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక యాప్ తీసుకువచ్చి రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నదని విమర్శించారు. కేంద్రం నుంచి యూరియా తేవడం చేతగానప్పుడు ఇంకా కుర్చీల్లో ఎందుకు కూర్చున్నారు? వెంటనే దిగిపోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎల్లారెడ్డి మదన్ మోహన్ ఎక్కడ ఉన్నావ్? అమెరికాలో ఉన్నావా… స్విట్జర్లాండ్‌లో చల్లగా ఏసీలో పడుకున్నావా.. ఇక్కడ రైతులు ధాన్యం పోతలేదని బాధ పడుతుంటే, నువ్వెక్కడున్నావ్.. మా పాలనలో ఒక్కరోజు ఆలస్యం కాకుండా కాంటా కాంగనే వడ్లు రైస్ మిల్లులకు పంపినం.. అవసరమైతే ఆర్టీసీ కార్గోల్లో పంపినం. ఇప్పుడు కనీసం ఒక్క రైతు ముఖంలో సంతోషం కనిపిస్త లేదు.. కన్నీళ్లు కనిపిస్తున్నాయి. ఎల్లారెడ్డి ప్రాంతంలో కల్లాల్లోని వడ్లు కేవలం 30 శాతం మాత్రమే పోగా, ఇంకా 70 శాతం ఉన్నాయి. ఇంకో రెండు రోజులైతే వర్షాలు వస్తాయి..ఇప్పటికే ఒకసారి భారీ వర్షంతో అవి నానిపోతే రైతులకు ఎంత కష్టమైందో అధికారులకు తెలుసు. అయినా పట్టించుకునే వారు లేరు. 11 నెలల క్రితం లింగంపేటలో బ్రిడ్జి కొట్టుకుపోతే సీఎం వచ్చి చూసిండు. కోటి రూపాయలు మంజూరుచేస్తమన్నరు.
ఎటు పోయాయి నిధులు, పనులు జరిగింది ఎక్కడ? బీఆర్ఎస్ హయాంలో తండాలకు రూ.35 కోట్లతో రోడ్లు వేశాం. ఎమ్మెల్యే మదన్మోహన్ నీ హయాంలో ఎన్ని నిధులు తీసుకు వచ్చావో జీవో కాపీలతో ఎల్లారెడ్డిలోని గాంధీ చౌక్ రా.. నా హయాంలో ఎన్ని నిధులు తెచ్చామో చర్చకు సిద్ధం. నీవు ఎలా గెలిచావో ఎల్లారెడ్డి ప్రజలకు బాగా తెలుసు. వెల్లుట్ల- గండివేట్ రోడ్డు కోసం అటవీ శాఖ అనుమతి తీసుకు వచ్చింది నేను, దానిని కూడా నువ్వే తెచ్చినట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటు. ఒక్క బోరు వేస్తే అపర భగీరథుడు అంటూ ప్రచారం చేసుకోవడం మీకే చెల్లుతుంది. గాంధారి, తాడ్వాయి, రాజంపేట మండలాల్లో మక్కజొన్న పంటను కొనుగోలు చేయక పోతే రైతులతో కలిసి పోరాటంలో పాల్గొంటా. కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని రైతులు తహతహలాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుతో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. రెండున్నరేండ్లుగా బెదిరింపులకు భయపడకుండా కష్టపడుతున్న కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది.
-జాజాల సురేందర్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయకుండా సమాజంలోని ప్రతి వర్గాన్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించి వారిని మోసం చేసింది. ప్రతి సంవత్సరం బడ్జెట్లో నిధులు పెంచుతామని ప్రకటించి మూడు బడ్జెట్లలో రూపాయి కూడా పెంచలేదు. ఎంతో మంది పేద ఎస్సీలకు కేసీఆర్ ప్రభుత్వం భూములు పంపిణీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కరికైనా ఇవ్వలేదు. ఎస్టీలకు రిజర్వేషన్ శాతం బీఆర్ఎస్ హయాంలో 6 నుంచి 10కి పెంచాం. కాంగ్రెస్ పార్టీ 10 నుంచి 12శాతానికి పెంచుతామని చెప్పి మోసం చేసింది. దళితుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పది లక్షల రూపాలయ దళిత బంధు అమలు చేసి నిజాంసాగర్ మండలంలోనే 14 వందల మందికి లబ్ధి చేకూర్చింది. కాంగ్రెస్ దళితుల అసైన్డ్ భూములను అమ్ముకోవడానికి హక్కులు ఇస్తామని, ఎస్సీలు, ఎస్టీల కోసం వేర్వేరుగా మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని దగా చేసింది. ఎస్సీల కోసం 5 ఐటీడీఏలు ఏర్పాటు చేస్తామని, ప్రత్యేకంగా సూపర్ స్పెషాలిటీ వైద్యశాల ఏర్పాటు చేస్తామని మోసం చేసింది. ఎస్సీ, ఎస్టీలకు 12 హామీలు ఇచ్చి అమలుచేయకుండా మోసం చేసింది.
-హన్మంత్ షిండే, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే
ఎల్లారెడ్డి నియోజక వర్గంలో సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి. దీనితో పాటు ప్రతి ఇంటికీ వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను చెప్పాలి. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. నిరంతరం ప్రజలతో ఉన్నందునే బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో స్థానం ఉంది. బీజేపీ, కాంగ్రెస్ కలిసి ఒక్కటిగా పని చేస్తున్నాయి. ఇది తెలంగాణలో ప్రధాని పర్యటనతో తేట తెల్లమైంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సర్ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు తమ ఓటుతో పాటు మన కార్యకర్తల ఓట్లు చెదిరి పోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలి. మన పార్టీ కార్యకర్తల ఓట్లను కాపాడుకోవాలి. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు అడగకుండానే సంక్షేమ పథకాలను అమలుచేశాం.
-వీజీ గౌడ్, సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి
నాయకుల ప్రోత్సాహం, కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఎల్లారెడ్డి నియోజక వర్గం సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవాలి. రాష్ర్టానికి మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరో రెండున్నర సంవత్సరాల తర్వాత కేసీఆర్ సీఎం కావడం ఖాయం. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పాలనతో విసిగి పోయారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారడం గ్యారంటీ.
– దఫేదార్ రాజు, జడ్పీ మాజీ చైర్మన్