బ్రదర్స్ అండ్ సిస్టర్స్
జియో హాట్‌స్టార్: స్ట్రీమింగ్ అవుతున్నది.
తారాగణం: రాజ్ అయ్యప్ప, బోస్ వెంకట్, గాయత్రి శాస్త్రి, నిఖిలా శంకర్, లుతూఫ్, కిషోర్, శ్రవంతి శ్రీకాంత్, సిద్ధార్థ్ బాబు తదితరులు. దర్శకత్వం: చిదంబరం మణివన్నన్
భారతీయ చిత్రసీమలో కుటుంబ కథా చిత్రాలు అనేకం తెరకెక్కాయి. ప్రేక్షకుల్ని ఏడిపించాయి. నవ్వించాయి. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించాయి. మొత్తానికి ఇండియన్ వెండితెరపై.. ‘ఎవర్ గ్రీన్ హిట్స్’గా పేరు తెచ్చుకున్నాయి. ప్రస్తుత ఓటీటీ కాలంలోనూ.. అడపాదడపా ఫ్యామిలీ డ్రామాలు రూపొందుతున్నాయి. ‘మినిమం గ్యారెంటీ’ వ్యూస్ సాధిస్తున్నాయి. అలా తమిళంలో తెరకెక్కిన వెబ్ సిరీస్.. బ్రదర్స్ అండ్ సిస్టర్స్! జియో హాట్‌స్టార్ వేదికగా.. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.
కుటుంబంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా.. అందరూ ధైర్యంగా నిలబడాలన్న సందేశం ఇస్తుంది. ఇక కథలోకి వెళ్తే.. చెన్నైలో ఉండే షణ్ముఖ సుందరం (బోస్ వెంకట్).. బట్టల దుకాణం నడుపుతూ ఉంటాడు. అతనికి భార్య (గాయత్రి శాస్త్రి), నలుగురు పిల్లలు జయశ్రీ (నిఖిలా శంకర్), హరిణి, మీరా, జగ్గూ ఉంటారు. జయశ్రీ లాయర్ కాగా, హరిణి ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. మీరానేమో క్రికెట్లో రాణించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ విషయంలో ఆమెను అశ్విన్ ప్రోత్సహిస్తూ ఉంటాడు. కొడుకు జగ్గూ.. డీజే!
హరిణి పనిచేసే సంస్థలోనే హెచ్ఆర్గా పనిచేసే సిద్ధార్థ్.. ఆమెను ప్రేమిస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని హరిణితో చెప్పినా.. ఆమె పట్టించుకోదు. అయినా విడవకుండా తన ప్రయత్నాలు తాను చేస్తూ ఉంటాడు. జయశ్రీ కొంతకాలం బెంగళూర్‌లో ఉండాల్సి వస్తుంది. అక్కడ పరిచయమైన మనోజ్‌తో ఆమె సహజీవనం చేస్తుంది. ఆరు నెలల తర్వాత.. మనోజ్ కనిపించకుండా పోతాడు. ఇలా.. షణ్ముఖ సుందరం ఫ్యామిలీలో ఒక్కొక్కరూ ఒక్కో సమస్యలో ఉంటారు. అయితే, షణ్ముఖ సుందరం కథ వేరేలా ఉంటుంది. అతనికి తరచుగా గిరిజ అనే ఒక మహిళ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి.
ఆమె అడిగినంత డబ్బును ఇతను ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అసలు.. ఈ గిరిజ ఎవరు? ఆమెతో షణ్ముఖ సుందరానికి ఉన్న సంబంధం ఏమిటి? మనోజ్ చేతిలో మోసపోయిన జయశ్రీ.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? హరిణిని బుట్టలో వేసుకోవడానికి సిద్ధార్థ్ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా? క్రికెట్లో రాణించాలనుకున్న మీరా కల నెరవేరుతుందా? ఇలా, ఒక్కొక్కరి కథ ఒక్కోలా ఉన్నప్పుడు.. ఒక కుటుంబంగా వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? అనేది మిగతా కథ. ఈ సిరీస్‌లో నాలుగు ఎపిసోడ్స్ మాత్రమే స్ట్రీమింగ్కు వచ్చాయి. ప్రతి బుధవారం మరిన్ని ఎపిసోడ్స్ విడుదల కానున్నాయి.