బీజింగ్ : చైనాలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న వాంగ్ జిబింగ్(56) తన కవితా సంకలనానికి దేశంలో అత్యున్నత సాహిత్య పురస్కారమైన ‘లు జిన్ లిటరసీ ప్రైజ్’ను గెలుచుకున్నారు. గిగ్ ఎకానమీలో పనిచేస్తున్న కార్మికుల కష్టాలు, ఆశయాలు తదితర అంశాలపై ఆయన రచించిన ‘లో ఫ్లైట్’ అనే కవితా సంకలనానికి ఈ అవార్డు లభించింది. జియాంగ్జు ప్రావిన్స్‌కు చెందిన వాంగ్ జిబింగ్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మానేశారు. గతంలో భవన నిర్మాణ పనులు, స్ట్రీట్ వాల్స్‌లో వస్తువులు అమ్మడం లాంటి పనులు చేశారు.
2019 నుంచి ఫుడ్ డెలివరీ రైడర్గానే పనిచేస్తూ, ఆర్డర్ల మధ్య విరామ సమయంలో చిన్న కాగితపు ముక్కలపై కవితలు రాసేవారు. 2022లో ఆయన రాసిన ‘మ్యాన్ ఇన్ ఎ హర్రీ’ కవిత సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెలుగులోకి వచ్చారు. 2023లో అదే పేరుతో కవితా సంకలనం ప్రచురితమయ్యింది. 2024లో ఆయన ‘లో ఫ్లైట్’ పుస్తకం కోసం సుమారు 200 మంది తోటి డెలివరీ రైడర్లను ఇంటర్య్యూ చేసి, వారి జీవన పరిస్థితులను కవితలుగా మలిచారు. తాను అత్యున్నత సాహిత్య పురస్కారం అందుకున్నప్పటికీ డెలివరీ ఉద్యోగాన్ని విడిచిపెట్టనని వాంగ్ తెలిపారు.