Foldable iPhone | ఆపిల్ కంపెనీ చాలాకాలంగా 4-మోడల్ ఐఫోన్ సిరీస్‌ను కొనసాగిస్తున్నది. ఈ ఏడాది నుంచి మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆపిల్ ఈ ఏడాది ఐఫోన్ 17 ఎయిర్‌ను విడుదల చేయాలని యోచిస్తున్నది. ఇది ప్లస్ వేరియంట్‌ని భర్తీ చేయనున్నది. ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూ.. కంపెనీ 2026 కంపెనీ తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ని విడుదల చేసే అవకాశం ఉన్నది. కొత్త బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఆపిల్ ఈ డివైజ్ కోసం క్లామ్‌షెల్ (ఫ్లిప్) డిజైన్ కాకుండా శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ తరహాలో బుక్ స్టయిల్ డిజైన్‌ను తీసుకురానున్నది.
నివేదిక ప్రకారం.. ఐఫోన్ ఫోల్డబుల్ శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ని పోలి ఉండనున్నట్లు తెలుస్తున్నది. డిజైన్ ఐఫోన్ 17 ఎయిర్ నుంచి ప్రేరణగా తీసుకోనున్నది. ఆపిల్ త్వరలో తీసుకురానున్న ఐఫోన్ 17 ఎయిర్ ఆల్ట్రా సిమ్గా తెలుస్తున్నది. కేవలం 5.5 ఎంఎం మందం మాత్రమే ఉండనున్నట్లు తెలుస్తున్నది. దాంతో కెమెరా, స్పీకర్ క్వాలిటీలో రాజీ పడక తప్పదని నివేదిక పేర్కొంది. కానీ, బ్యాటరీ లైఫ్ ఐఫోన్ 16ఈ తరహాలోనే ఉంటుంది. ఇక ఐఫోన్ 17 ఎయిర్ వినూత్న డిజైన్‌ను ఆపిల్ భవిష్యత్ ఫోల్డబుల్ ఐఫోన్‌కు పునాదిగా భావిస్తున్నది. లీకుల ప్రకారం.. ఐఫోన్ ఫోల్డబుల్ పూర్తిగా తెరిచిన సమయంలో 7.8 ఇంచెస్ మెయిన్ డిస్ప్లే, 5.5 ఇంచెస్ ఎక్స్టర్నల్ స్క్రీన్‌తో వస్తుంది. స్ట్రాంగ్, డ్యూరబుల్తో ఫోన్‌ని తీసుకువచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.
ఇందు కోసం లిక్విడ్ మెటల్ని ఉపయోగించనున్నట్లు సమాచారం. ఫోల్డబుల్ ఫోన్ ఓపెన్ చేసిన సమయంలో 4.5 ఎంఎం.. మతపెట్టిన సమయంలో 9 ఎంఎం నుంచి 9.5 ఎంఎం మందం ఉండనున్నది. ఇదే నిజమైతే ఇప్పటి వరకు ఉన్న ఫోల్డబుల్ ఫోన్లలో ఇదే స్లిమ్ ఫోన్‌గా మారనున్నది. ఇక ఆపిల్ ఫేస్ టచ్ ఐడీకి బదులుగా టచ్ ఐడీ సెన్సార్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తున్నది. ఫోన్ క్వాలిటీని మెరుగుపరిచేందుకు టైటానియం ఛాసిస్‌ను ఉపయోగించవచ్చని తెలుస్తున్నది. దాంతో మొబైల్ తక్కువ బరువుతో ప్రీమియం ఎక్స్పీరియన్స్ అందించనుంది. ఇప్పటి వరకు మొబైల్ స్పెసిఫికేషన్స్‌ను ఆపిల్ వెల్లడించలేదు. కేవలం ఇవన్నీ లీకులు మాత్రమే. ఇక ఈ మొబైల్ ధర అమెరికాలో 2,300 డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.1.91లక్షలుగా ఉండనున్నట్లు తెలుస్తున్నది.