F & O Trading | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ‘హై-రిస్క్ హై-రివార్డ్’ గేమ్‌గా పేరున్న ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) ట్రేడింగ్‌లో నష్టపుటేరులు పారుతున్నాయి. 2021-22 నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ఎఫ్‌అండ్‌వో సెగ్మెంట్లో 1.13 కోట్ల రిటైల్ ట్రేడర్లు రూ.1.81 లక్షల కోట్లు కోల్పోయారు మరి. ఈ మూడేండ్లలో ఒక్కో ఇండివీడ్యువల్ ట్రేడర్‌కు సగటున దాదాపు రూ.2 లక్షల (లావాదేవీ ఖర్చులతోసహా) నష్టం వాటిల్లింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24) విషయానికే వస్తే.. 73 లక్షల మందికి సగటున రూ.1.2 లక్షల లాస్ వచ్చింది. ఇదంతా కలిపితే రూ.75,000 కోట్లుగా ఉన్నది. ఈ మేరకు సోమవారం మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ విడుదల చేసిన ఓ అధ్యయనం తెలిపింది. కాగా, ఈ సెగ్మెంట్లో కేవలం 7.2 శాతం మందే లాభపడ్డారు. ఒక్కో మదుపరి సగటు లాభం రూ.3 లక్షలుగా ఉన్నది. ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టుల్లో రిటైల్ ఇన్వెస్టర్లు చురుగ్గా పాల్గొంటుండటంపట్ల సెబీ తరచూ ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
అన్మోల్ అంబానీపై కోటి జరిమానా
అనిల్ అంబానీ కుమారుడు అన్మోల్ అంబానీపై సెబీ కోటి రూపాయల జరిమానా వేసింది. రిలయన్స్ హోం ఫైనాన్స్ కేసులో కార్పొరేట్ రుణాలను ఆమోదించేటప్పుడు అశ్రద్ధ వహించారని, నిబంధనల్ని పాటించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ఫైన్ విధించింది. అలాగే రిలయన్స్ హౌజింగ్ ఫైనాన్స్ చీఫ్ రిస్క్ ఆఫీసర్ కృష్ణన్ గోపాలకృష్ణన్పైనా రూ.15 లక్షల జరిమానా వేస్తూ సెబీ నిర్ణయం తీసుకున్నది. ఈ ఇరువురు 45 రోజుల్లోగా ఈ జరిమానాలను చెల్లించాలని కూడా ఆదేశించింది. గత నెల అనిల్‌పైనా రూ.25 కోట్ల జరిమానా పడ్డది తెలిసిందే. కాగా, బ్రైట్‌కామ్ గ్రూప్‌పై సెబీ రూ. 8 లక్షల జరిమానా విధించింది.