న్యూఢిల్లీ, అక్టోబర్ 4: టెల్ అవీవ్‌కు వెళుతున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని ఇజ్రాయెల్ భూభాగంలో కూల్చివేసేందుకు తాను పన్నిన కుట్రను అందులోని సహ-పైలట్ హమామ్ అల్-హమ్మమీని యూఏఈ అధికారుల విచారణలోఅంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. హీబ్రూ మీడియా సంస్థ ఇజ్రాయెల్ హాయోమ్లో వచ్చిన కథనం ప్రకారం విచారణ సమయంలో అల్-హమ్మమీ ఇజ్రాయెల్‌లోని ఒక భూతల లక్ష్యాన్ని విమానంతో ఢీ కొట్టాలని భావించినట్లు అంగీకరించాడు.
ఇటువంటి చర్యకు పకడ్బందీ ప్రణాళిక, లాజిస్టికల్ సహకారం అవసరమని, అలాగే ఏదైనా ఉగ్రవాద సంస్థ నుంచి వెలుపలి సహాయం అంది ఉండవచ్చని వివిధ నిఘా సంస్థలు భావిస్తున్నాయి. దర్యాప్తులో ఒక ఇజ్రాయెల్ దర్యాప్తు బృందం కూడా చేరిందని ఆ కథనం పేర్కొంది. అల్-హమ్మమీ అత్యవసర పరిస్థితుల్లో వాడే గొడ్డలితో కెప్ట్టె్టన్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసి, విమాన నియంత్రణ వ్యవస్థలను తన ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నించాడని దర్యాప్తులో తేలిందని యూఏఈ తెలిపింది.