Bihar | కొన్ని ముఖ్యమైన నదులు నేపాల్ నుంచి బిహార్‌లోకి ప్రవహిస్తాయి. వాటిలో గండక్ (Gandak), కోసి నదులు ముఖ్యమైనవి. ఇవి భారత భూభాగంలోకి ప్రవేశించే ముందు హిమాలయాలు, టిబెట్‌లో ఉద్భవిస్తాయి. నేపాల్‌లో సంభవించిన వరదల వల్ల అక్కడి నదులు ఉప్పొంగుతున్నాయి. ఇళ్లు కొట్టుకుపోయాయి. మరణాలు, గల్లంతయిన సంఘటనలు సంభవించాయి. నేపాల్‌లోని గండక్ నది ఎగువ పరీవాహక ప్రాంతంలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉంది.

Gandak Bihar
దీంతో బిహార్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఆ రాష్ట్ర సీఎం సమ్రాట్ చౌధరి (Samrat Choudhary) పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ పర్యవేక్షిస్తున్నారు. అవసరమైనతే గండక్, కోసి పరిసర ప్రాంతాలకు వెళ్తాను అని సీఎం వెల్లడించారు.
వరద ప్రవాహం గండక్ నదిపై పడితే ఆ నది వెంట ఉన్న బిహార్‌లోని జిల్లాల్లో పరిస్థితిని ఎదుర్కోవడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. నదీ చుట్టుపక్కల ఉండే గ్రామాల్లోని ప్రజలకు సలహాలు, సూచనలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని, నదుల వద్దకు వెళ్లవద్దని, అధికారుల సూచనలను మాత్రమే పాటించాలని, వదంతులను నమ్మవద్దని సూచించారు.