Suicide : విమానం గాల్లో ఎగురుతుండగానే ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ దానిలో నుంచి దూకి ఆత్మహత్య (Suicide) కు పాల్పడ్డాడు. అతడి నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్న విద్యార్థికి క్యారీ ఆన్ అని చెప్పి మరీ అతడు దూకేశాడు. అర్జెంటీనా (Argentina) లోని టొలెడాలో జరిగిన ఈ అనూహ్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫ్లయింగ్ ప్యారెట్ కార్డోబా ఫ్లయింగ్ స్కూల్లో ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్న లియాండ్రో ఆండ్రెస్ (Leandro Andres).. ఓ విద్యార్థికి ట్రైనింగ్ ఇస్తున్న సమయంలో అకస్మాత్తుగా విమానం నుంచి దూకేశారు.
గతవారం జరిగిన ఈ ఘటన గురించి పోలీసులు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఏం చేయాలో నీకు తెలుసు. ఆ ప్రకారమే నడుచుకో’ అంటూ ఇన్స్ట్రక్టర్ తన హెడ్సెట్, సీట్‌బెల్ట్ తీస్తూ ఆ స్టూడెంట్‌కు చెప్పారు. ఇలా జరుగుతుందని ఏమాత్రం ఊహించని ఆ యువకుడు తొలుత కంగుతిన్నా తర్వాత విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ ఘటనపై ఫ్లయింగ్ స్కూల్ డైరెక్టర్ ఎడ్వర్డో అల్వారెజ్ స్పందించారు.
ఇన్స్ట్రక్టర్ ఇలా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నాడని ఏమాత్రం ఊహించలేకపోయామని, అంతకుముందు అతడు మరో విద్యార్థికి కూడా ట్రెయినింగ్ ఇచ్చారని అల్వారెజ్ చెప్పారు. ఈ ఘటన తమను షాక్‌కు గురిచేసిందని చెప్పారు. అసలు విమానం గాల్లో ఉన్నప్పుడు డోర్ తీయడం చాలా కష్టమని, ఆయన ఎంతో అనుభవజ్ఞుడైన ఇన్స్ట్రక్టర్ కాబట్టి తీయగలిగాడని అన్నారు. కాగా ఇన్స్ట్రక్టర్ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు అతడి మరణానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.