మంత్రివర్గ సహచరులు, కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల తిరుగుబాటుతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పదవికి రాజీనామా చేయక తప్పలేదు. ఎన్నో ఆరోపణలు, స్కాంలు చుట్టుముట్టగా ఉక్కిరిబిక్కిరైన జాన్సన్ కీలక పదవుల నుంచి వైదొలిగారు. బోరిస్ జాన్సన్ పదవికి ఎసరు పెట్టేలా ఆయనను చుట్టుముట్టిన స్కాండల్స్ వివరాలు చూద్దాం.
పింఛర్ ఎఫైర్
గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న క్రిస్టాఫర్ పింఛర్కు డిప్యూటీ చీఫ్ విప్ పదవి కట్టబెట్టడం బొరిస్ జాన్సన్ ప్రభుత్వంలో అగ్గిరాజేసింది. ఆరోపణల విషయం తెలిసి పింఛర్ను అందలం ఎక్కించడాన్ని నిరసిస్తూ ప్రభుత్వం నుంచి మంత్రులు సహా చట్టసభ సభ్యులు వరుసగా వైదొలగడం కలకలం రేపింది. ఓ పార్టీలో మద్యం సేవించి అనుచిత ప్రవర్తనతో ఇతరులకు అసౌకర్యం కలిగించాడనే ఆరోపణలపై పింఛర్ను గతవారం పార్టీ నుంచి సస్పెండ్ చేసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 2019లో పింఛర్ లైంగిక దుష్ర్పవర్తన వ్యవహారం తమకు తెలియదని జాన్సన్ కార్యాలయం నమ్మబలికినా ఇది వాస్తవం కాదని, ఈ ఆరోపణల గురించి ప్రధానికి తెలుసని ప్రభుత్వ ప్రతినిధి పేర్కొన్నారు. ప్రధాని అసత్యం చెబుతున్నారని 2015 నుంచి 2020 వరకూ బ్రిటన్ విదేశాంగ కార్యాలయంలో సీనియర్ అధికారిగా పనిచేసిన సైమన్ మెక్ డొనాల్డ్ ఆరోపించడం కలకలం రేపింది.
పార్టీగేట్
కొవిడ్-19 లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ తన డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయం సహా ప్రభుత్వంలో పార్టీలు, విందులు జరిగాయనే పార్టీగేట్ స్కాండల్ బోరిస్ జాన్సన్ సర్కార్‌కు చికాకులు తెచ్చిపెట్టింది. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించి ఓ బర్త్‌డే పార్టీకి హాజరైనందుకు ఏకంగా జాన్సన్‌కు పోలీసులు ఫైన్ విధించడం కలకలం రేపింది.
సెక్స్ స్కాండల్స్
కన్జర్వేటివ్ సభ్యులపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా జాన్సన్ ప్రభుత్వానికి తలవంపులు తెచ్చాయి. ఈ ఆరోపణలపై ఇద్దరు చట్టసభ సభ్యులు రాజీనామా చేయగా వారి స్ధానాలను భర్తీ చేసేందుకు జరిగిన ఎన్నికల్లో కన్జర్వేటివ్‌లకు ఓటమి ఎదురైంది. 15 ఏండ్ల బాలుడిని లైంగిక వేధింపులకు గురిచేసిన కేసులో కన్జర్వేటివ్ ఎంపీ ఇమ్రాన్ అహ్మద్ ఖాన్ రాజీనామా చేశారు. హౌస్ ఆఫ్ కామన్స్‌లో అశ్లీల వీడియోలు చూసినందుకు మరో కన్జర్వేటివ్ సభ్యుడు నీల్ పరిష్ రాజీనామా చేశారు. లైంగిక దాడి, వేధింపుల కేసులో మరో కన్జర్వేటివ్ సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్యాటర్సన్ కేసు
తనకు ముడుపులు చెల్లించిన కంపెనీలకు అనుకూలంగా లాబీయింగ్ చేస్తున్న కన్జర్వేటివ్ సభ్యుడు, మాజీ మంత్రి ఓయెన్ ప్యాటర్సన్ను 30 రోజులు సస్పెండ్ చేయాలని గత ఏడాది పార్లమెంట్ స్టాండర్డ్స్ కమిటీ సిఫార్సు చేసింది.
బ్రిటన్ ఎలక్టోరల్ కమిషన్ ఫైర్
సెలబ్రిటీ డిజైనర్ నేతృత్వంలో జాన్సన్ డౌనింగ్ స్ట్రీట్ ఫ్లాట్ పునరుద్ధరణ విషయంలో దాని చెల్లింపులకు వచ్చిన విరాళాలపై సరైన నివేదిక ఇవ్వడంలో విఫలమైనందుకు బ్రిటన్ ఎన్నికల కమిషన్ కన్జర్వేటివ్‌లపై 17800 పౌండ్ల జరిమానా విధించింది. డోనార్తో సంప్రదింపులకు సంబంధించిన కొన్ని మెసేజ్‌లను బయటపెట్టడంలో ప్రధాని విఫలమయ్యాడని జాన్సన్ ఎథిక్స్ అడ్వైజర్ ఆరోపించారు. అయితే మెసేజ్‌ల గురించి జాన్సన్ ఉద్దేశపూర్వకంగా అవాస్తవాలు చెప్పలేదని వివరణ ఇచ్చారు.