Fish Venkat | తెలుగు సినిమా అభిమానులకు ఇది నిజంగా బాధాకరమైన వార్త. ప్రముఖ హాస్య నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా కిడ్నీ, లివర్ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూసారు. ఫిష్ వెంకట్ మరణం తెలుగు సినీ ప్రపంచానికి తీరని లోటుగా భావిస్తున్నారు.తెలంగాణ యాస, అమాయకమైన హావభావాలు, మంచి కామెడీ టైమింగ్ ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆయన, ఎక్కువగా విలన్ గ్యాంగ్‌లోని అనుచరుడిగా లేదా సపోర్టింగ్ పాత్రలలో కనిపిస్తూ తనదైన స్టైల్‌తో నవ్వుల పంట పండించారు. ఆయన నటించిన కొన్ని బెస్ట్ కామెడీ సినిమాల చూస్తే.. ఖుషి ( 2001)లో గుడుంబా సత్తి గ్యాంగ్‌లో భాగంగా ఆయన చేసిన పాత్ర ఎంతో పాపులర్ అయింది. ఇదే సినిమాలో తనకు “ఫిష్” అనే బిరుదు రావడానికి కారణమైంది.
ఆది (2002) ఎన్టీఆర్ హీరోగా వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కాగా, ఇందులో ఫిష్ వెంకట్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. “ఒక్కసారి తొడకొట్టు చిన్నా” డైలాగ్ అభిమానుల్లో ఫేమస్ అయింది.ఢీ ( 2007)లో శ్రీహరి అనుచరుడిగా కనిపించి బ్రహ్మానందంతో కలసి చేసిన కామెడీ తెగ వినోదం పంచింది. ఇక ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో కనిపించిన అదుర్స్ సినిమాలో ఫిష్ వెంకట్ తన స్టైల్ కామెడీతో అందరినీ ఆకట్టుకున్నారు. మాస్ హీరో ఇమేజ్ ఉన్న కందిరీగ (2011) సినిమాలో కూడా ఆయన పాత్రకు మంచి స్పందన లభించింది. విలన్ క్యాంప్‌లో ఓ ప్రత్యేక హాస్య కోణాన్ని తేవడంలో ఆయన పాత్ర కీలకమైంది.
పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో సిద్ధప్ప నాయుడు అనుచరుడిగా ఫిష్ వెంకట్ పాత్ర ప్రేక్షకులను బాగా నవ్వించింది. సాయి ధరమ్ తేజ్ నటించిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో కొద్ది స్క్రీన్ స్పేస్ ఉన్నప్పటికీ ఫిష్ వెంకట్ పాత్ర కామెడీగా నిలిచింది. భం భోలేనాథ్ (2015)లో కూడా ఫిష్ వెంకట్ తన హాస్య నటనతో ప్రత్యేకంగా అలరించారు .హుషారు (2018)లో “లడ్డన్న” అనే పాత్రలో ఆయన చేసిన కామెడీ ట్రాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డి.జె. టిల్లు (2022)లో హెడ్ కానిస్టేబుల్‌గా చేసిన పాత్రకు ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. ఇలా అన్ని పాత్రలలోనూ కొంత కామెడీ టచ్‌ను కలిపే ప్రయత్నం చేసిన ఫిష్ వెంకట్, తెలుగు సినిమా అభిమానుల హృదయాల్లో తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు.