హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి పరిహారం చెల్లించే బాధ్యత సంబంధిత వాహనం కొనుగోలుకు ఆర్థిక సాయం చేసిన ఫైనాన్షియర్‌కు ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. వాహనం యాజమాన్య బాధ్యతలు, దాని నిర్వహణ, డ్రైవర్ నియామకం లాంటి అంశాలతో సదరు ఫైనాన్షియర్‌కు సంబంధం ఉండదని పేరొన్నది. వివరాల్లోకి వెళ్తే.. లారీ కొనుగోలు నిమిత్తం జలీల్ అనే వ్యక్తికి రాజేంద్రకుమార్ ధారెవా ఆర్థిక సాయం అందించారు. ఆ లారీని నడిపేందుకు జలీల్ డ్రైవర్‌ను నియమించాక ఆ వాహనం ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి రూ.4.73 లక్షల పరిహారం చెల్లించాలని ట్రిబ్యునల్ ఆదేశించింది.
పరిహారం చెల్లించే బాధ్యతను తనపై మోపుతూ ట్రిబ్యునల్ ఉత్తర్వులు జారీచేయడంపై రాజేంద్రకుమార్ ధారెవా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ.. వాహనం కొనుగోలుకు మూలధనం, రుణం లేదా ఇతర రూపంలో ఆర్థిక సాయం అందించడం వరకే ఫైనాన్షియర్ పాత్ర పరిమితమవుతుందని స్పష్టం చేశారు. కార్మిక పరిహార చట్టం ప్రకారం వాహనం నిర్వహణ, డ్రైవర్ నియామకం తదితర బాధ్యతలు ఆ వాహనం కొనుగోలు చేసిన వ్యక్తికే ఉంటాయని పేరొన్నారు. వాహనానికి సంబంధించిన తాకట్టు పత్రాల్లో ఫైనాన్షియర్ పేరు ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తిని వాహన యజమానిగా పరిగణించలేమని తెలిపారు. డ్రైవర్ విధులతో ఫైనాన్షియర్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ ట్రిబ్యునల్ ఉత్తర్వులను రద్దు చేశారు.