పనాజీ: బాలీవుడ్ నటుడు నానా పటేకర్(Nana Patekar) గురువారం తెల్లవారుజామున గోవాలో మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్ర పోలీసులు అసహజ మరణం కింద కేసు నమోదు చేశారు. నానా పటేకర్ మృతి కేసులో మరింత దర్యాప్తు చేపట్టనున్నట్లు పోలీసులు వెల్లడించారు. భారతీయ నాగరిక సురక్షా సంహితలోని 194వ సెక్షన్ కింద పనాజీ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. డోనాపౌలాలో ఉన్న ఓసియన్ పార్క్ నివాసంలో నానా పటేకర్ తుది శ్వాస విడిచారు.
76 ఏళ్ల పటేకర్ మృతిచెందినట్లు మణిపాల్ ఆస్పత్రి డాక్టర్లు డ్రువీకరించినట్లు పోలీసు ఇన్స్పెక్టర్ నితిన్ నాయక్ తెలిపారు. ఈ కేసులో ఆయనే దర్యాప్తు చేస్తున్నారు. గురువారం రాత్రి పుణెలో ఉన్న డోంజే ఫార్మ్హౌజ్లో నానా పటేకర్ పార్దీవదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఛాతిలో నొప్పి వస్తున్నట్లు తెల్లవారుజామున 2.30 నిమిషాలకు తన స్నేహితుడికి నానా పటేకర్ మేసేజ్ చేశాడని డాక్టర్ శేఖర్ సాల్కార్ తెలిపారు. కానీ ఉదయం 4 గంటలకు పటేకర్ ఇంటికి ఆ మిత్రుడు వెళ్లాడు. అప్పటికే పటేకర్కు తీవ్ర స్థాయిలో చమటలు పట్టాయని, స్పృహ కోల్పోయే దశకు చేరుకున్నట్లు డాక్టర్లు చెప్పారు. 4.20 వరకు ఆస్పత్రికి తీసుకెళ్లారు. సుమారు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేశారు. కానీ నానా పటేకర్ స్పందించలేదు. దీంతో 5.20 నిమిషాలకు ఆయన మృతిచెందినట్లు ప్రకటించారు.