న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా గడ్డపై ఐదు వికెట్లు దక్కకపోవడంతో అప్పటికే అసంతృప్తిలో ఉన్న తనకు అప్పటి చీఫ్ కోచ్ రవిశాస్త్రి మాటలు మరింత బాధించాయని దీంతో కదులుతున్న బస్సు కిందకు తోసేసినట్లు అనిపించిందని సీనియర్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు. 2018-19 పర్యటనలో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు పడగొట్టి అదుర్స్ అనిపించాడు. మ్యాచ్ అనంతరం అప్పటి కోచ్ రవిశాస్త్రి మీడియాతో మాట్లాడుతూ.. ‘విదేశాల్లో భారత తొలి ప్రాధాన్య స్పిన్నర్ కుల్దీపే’ అని పేర్కొన్నాడు. ఈ మాటలు తనను తీవ్రంగా కలచివేశాయని.. కెరీర్‌కు వీడ్కోలు పలకాలనే ఆలోచనలు రేకెత్తించాయని అశ్విన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ‘నేను రవిశాస్త్రిని అమితంగా గౌరవిస్తా. మనలో చాలామంది కొన్నిసార్లు ఏదో ఒకటి మాట్లాడి ఆ తర్వాత వాటిని వెనక్కి తీసుకుంటాం. కానీ ఆ సమయంలో నేను చాలా బాధపడ్డా. అయితే వ్యక్తిగతంగా కుల్దీప్ పట్ల నేనేంతో సంతోషించా.
ఆసీస్‌లో నాకు ఐదు వికెట్లు దక్కకపోయినా.. అతడికి దక్కినందుకు ఆనందించా. ఇక సిరీస్ గెలిచాక పార్టీలో పాల్గొనడానికి కూడా మనసు ఒప్పలేదు. పార్టీలో భాగస్వామి కావాలంటే విజయంలో నావంతు పాత్ర ఉండాలని అనుకుంటా. అలా కాకుండా నన్ను బస్ కింద పడేసినట్లు అనిపిస్తే ఎలా ఉంటా? జట్టు విజయాన్ని ఎలా ఆస్వాదిస్తా? అక్కడి నుంచి నా గదికెళ్లి భార్య, కుమార్తెతో మాట్లాడా. కాస్త కుదుటపడ్డాక వచ్చి సంబురాల్లో పాల్గొన్నా. ఎందుకంటే అది చారిత్రక విజయం’ అని అశ్విన్ వివరించాడు. అలాగే ఆ సిరీస్ తర్వాత చాలాసార్లు ఆటకు వీడ్కోలు చెప్పాలనుకున్నట్లు అశ్విన్ పేర్కొన్నాడు.