నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 26: పంట కోసి నలభై రోజులు దాటిపాయే.. కల్లాల నుంచి వడ్లు కదులుతనే లేవు.. లారీలు రాకపోతే, ధాన్యం పోకపోతే పురుగుల మందు తాగి సచ్చిపోవుడు తప్ప మరో గతి లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలులో జాప్యంపై మంగళవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనకు దిగారు. లారీల కొరతను నిరసిస్తూ నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం స్వర్ణ గ్రామంలో రైతులు స్వర్ణ-నిర్మల్ రహదారిపై రెండు గంటలపాటు ధర్నా నిర్వహించారు. దీంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచి, రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
లారీల కొరతను నివారిస్తామని, కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా చూస్తామని తహసీల్దార్ విజయకాంత్రావు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ధాన్యం కొనాలంటూ నిర్మల్ జిల్లా వెల్మల్‌కు చెందిన రైతులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు.
కేంద్రంలో 30 లారీల వరకు ధాన్యం ఉన్నా తరలించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. లారీలు పంపిస్తామని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్‌కుమార్ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ధాన్యం కొనకపోవడం, కాంటా పెట్టినా తరలించకపోవడాన్ని నిరసిస్తూ జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నవాబుపేటలో జనగామ-సూర్యాపేట రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. రైతుల ఆందోళనకు హమాలీలు సైతం మద్దతు పలికారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కేంద్రానికి రెండు రోజులకో లారీ మాత్రమే వస్తుండటంతో నవాబుపేట కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాశులు పేరుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటివరకు 20 లారీల ధాన్యం తరలించినా ఇంకా సుమారు 30 లారీల లోడ్ మిల్లులకు తరలాల్సి ఉన్నదని చెప్పారు. సత్వరం స్పందించపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం హాజీపూర్, హాజీపూర్ సడాక్ తండా, జిత్య తండాకు చెందిన రైతులు రోడ్లెక్కారు. హాజీపూర్ సడాక్తండాలో ఎల్లారెడ్డి – కామారెడ్డి ప్రధాన రహదారిపై ధాన్యం పోసి నిప్పు పెట్టారు. కాంటా వేసిన 2 వేల సంచులు కల్లాల్లోనే ఉన్నాయని, ఐదు రోజులుగా లారీలే రావడం లేదని మండిపడ్డారు. ఆలస్యంగా తీసుకెళ్లడంతో బరువు తగ్గి నష్టపోతున్నామని వాపోయారు. పైగా లారీ డ్రైవర్లు ఒక్కో బస్తాకు రూ.5 వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
లారీలు పంపకపోతే వడ్ల కుప్పల వద్దే పురుగు మందు తాగి సచ్చిపోతామని హెచ్చరించారు. యాదాద్రి జిల్లా రాజాపేట మండలం సింగారం, బొందుగుల గ్రామాల్లో రైతులు ఆందోళనకు దిగారు. బొందుగులలో పంటకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు. సింగారం రైతులు రాజాపేట గోదాముకు తాళం వేసి ధాన్యం బస్తాలకు నిప్పంటించి ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం నిల్వ ఉండటంతోపాటు అధికారులు, మిల్లర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడ్డారు.

నలభై రోజులైనా కల్లాల నుంచి వడ్లు కదలడం లేదని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ సడాక్తండాలో ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన తెలుపుతున్న రైతులు

కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ యాదాద్రి జిల్లా రాజాపేటలో గోదాముకు తాళం వేసి ధాన్యం బస్తాకు నిప్పు పెట్టి నిరసన తెలుపుతున్న సింగారం రైతులు

ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న రైతులు