అగ్ర కథానాయకుడు ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అవన్నీ పాన్ ఇండియా చిత్రాలే కావడం విశేషం. వాటిలో భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందిస్తున్న ‘ఆదిపురుష్’ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఈ చిత్రం కోసం ప్రభాస్ తీవ్రంగా శ్రమిస్తున్నారని, ముఖ్యంగా శరీరాకృతిని తీర్చిదిద్దుకోవడంపై ఎక్కువ దృష్టిపెట్టారని చిత్ర దర్శకుడు ఓంరౌత్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘అవతార పురుషుడు రాముడి పరాక్రమాన్ని, గుణగణాల్ని
ఆవిష్కరిస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. రాముడు గొప్ప విలుకాడు. ఆయన దేహాకృతి కూడా ప్రత్యేకంగా ఉంటుంది. తెరపై రాముడి పాత్రలో సహజత్వం కనిపించడానికి ప్రభాస్ ఎంతో శ్రమిస్తున్నారు. విలువిద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకోవడంతో పాటు కఠోర వ్యాయామాలతో శరీరాన్ని అనుకున్న విధంగా మలచుకున్నారు. సంస్కృతం, హిందీ సంభాషణల ఉచ్చారణ విషయంలో ఎంతో సాధన చేశారు. రాముడి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు’ అని ఓంరౌత్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో సీత పాత్రలో కృతిసనన్ నటిస్తుండగా..ప్రతినాయకుడు లంకేష్ పాత్రలో సైఫ్అలీఖాన్ కనిపించనున్నారు.