హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో సస్పెన్షన్ వేటు వేసిన తీరు ప్రజాస్వామంలో చీకటి రోజుగా బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అభివర్ణించారు. ఆదివారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి గంగుల కమలాకర్, బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద, ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, సం జయ్, విజయుడులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవిత్రమైన శాసనసభను కాం గ్రెస్ నేతలు గాంధీభవన్‌లా మార్చారని మండిపడ్డారు. ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని హరీశ్‌రావు ఆధారాలతో అసెంబ్లీలో బయటపెట్టి హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు. తాము హౌస్ కమిటీకి డిమాండ్ చేస్తే, సీఎం రేవంత్‌రెడ్డి సీబీసీఐడీ విచారణ చేయిస్తామని చెప్పారు. దీంతో తమ డిమాండ్లపై నిరసన తెలుపుతుంటే అటెన్షన్ డైవర్షన్‌లో భాగంగా ఈ అంశాన్ని సీఎం కులాలకు అంటగట్టే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌ను తా ము ఏనాడూ దళితుడిగా భావించలేదని స్పష్టం చేశారు. ‘నా వెంట్రుక కూడా పీక లేరు అన్నట్టు’ కడియం శ్రీహరి వ్యవహారశైలి ఉన్నదన్నారు.
భట్టి విక్రమార్క నాడు పాదయాత్ర చేశారని సీఎం రేవంత్‌రెడ్డి సభలో గుర్తు చేశారని, మరి ఆయననెందుకు సీఎం చేయలేదో చెప్పాలి? అని తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. సభలో అధికార పార్టీ సభ్యులతో బీఆర్ఎస్ను తిట్టించారని, వెనుకబడిన తరగతుల పద్దుల విషయంలో చర్చపై వాస్తవాలు బయటకు వస్తాయనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఒక మంత్రి ఏమో హౌస్ కమిటీకి అంగీకారం చెప్తాడు, సీఎం ఏమో సీబీసీఐడీ విచారణ చేయిస్తా అంటారు. ముఖ్యమంత్రి, మంత్రుల మధ్యనే సఖ్యత లేదని పేర్కొన్నారు. సభను త ప్పుదారి పట్టించి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేయించారని ఆరోపించారు. ద్రవ్యవినియోగ బిల్లుపై బీఆర్ఎస్ అభ్యంతరం చెబుతుందనే సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేశారని, ఇది దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.