
హైదరాబాద్, నవంబర్12 (నమస్తే తెలంగాణ): జల వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్ ఏర్పాటు విషయంలో తెలంగాణ గురించి కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చెప్పిన విషయాలన్నీ పచ్చి అబద్ధాలని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ పట్ల కేంద్రం మొదటినుంచీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు. ఇంజినీర్స్ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. షెకావత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంలో ఆలస్యం చేయడం వల్లనే ట్రిబ్యునల్ ఏర్పాటు ఆలస్యమైందనటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కాకుండా, కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి తెలంగాణకు న్యాయమైన నీటి వాటాను కేటాయించాలని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన నెలరోజుల్లోనే కేంద్రానికి సీఎం కేసీఆర్ విన్నవించారని గుర్తుచేశారు. అంతర్రాష్ట్ర జలవివాదల చట్టం 1956 సెక్షన్ 3 ప్రకారం ఏడాదిలోగా కేంద్రం కచ్చితంగా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాల్సి ఉన్నదని, అయినప్పటికీ నాడు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలోనే నీటి వాటా కోసం తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని వివరించారు. రివర్ బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం స్వాగతించిందని చెప్పడం కూడా పచ్చి అబద్ధమని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు పూర్తిచేసిన తరువాతనే గెజిట్‌ను విడుదల చేయాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారని, 2వ అపెక్స్ కౌన్సిల్ సమావేశం మినిట్స్‌లోనూ ఇది నమోదైందని వివరించారు. అయినప్పటికీ కేంద్రం రాష్ర్టాల నీటి హక్కులను కాలరాస్తూ గెజిట్‌ను విడుదల చేసిందని మండిపడ్డారు. ఇకనైనా ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని, వెంటనే ట్రిబ్యునల్‌కు రిఫర్ చేసి తెలంగాణకు న్యాయమైన నీటివాటా పంచాలని డిమాండ్ చేశారు. సమావేశంలో తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోలి దామోదర్‌రెడ్డి, అసోసియేట్ అధ్యక్షులు వెంకటేశం, రాంరెడ్డి, ప్రొఫెసర్ రమణానాయక్ తదితరులు పాల్గొన్నారు.