Bharathiraja | దక్షిణాది చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీ రాజా (85) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. భారతీరాజా మరణ వార్తతో తమిళ సినీ పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. 2025 మార్చిలో భారతీరాజా కుమారుడు మనోజ్ భారతీ రాజా కేవలం 48 ఏళ్ల వయసులో గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఈ విషాదాన్ని భారతీరాజా తట్టుకోలేకపోయారని కుటుంబ సభ్యులు, సన్నిహితులు చెబుతుంటారు. కొడుకు అంత్యక్రియల సమయంలో ఆయన తీవ్ర ఆవేదనకు గురైన దృశ్యాలు అప్పట్లో అందరినీ కలచివేశాయి. పుత్రశోకం నుంచి పూర్తిగా కోలుకోలేకపోయిన భారతీరాజా ఆరోగ్యం క్రమంగా మరింత బలహీనపడింది.
గత ఏడాది డిసెంబర్లో శ్వాసకోశ సంబంధిత సమస్యలు, ఉబ్బసం కారణంగా భారతీరాజాను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందినప్పటికీ, వయసు పైబడటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి తరచూ ఆందోళనకరంగా మారింది. కుమారుడి మరణం తర్వాత మానసికంగా కూడా ఆయన తీవ్రంగా కుంగిపోయారని కుటుంబ సభ్యులు పలుమార్లు వెల్లడించారు. 1977లో విడుదలైన 16 వయాతినిలే (తెలుగులో ‘పదహారేళ్ల వయసు’) చిత్రంతో భారతీరాజా దర్శకుడిగా సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. గ్రామీణ నేపథ్య కథలను సహజత్వంతో వెండితెరపై ఆవిష్కరించి తమిళ సినిమాకు కొత్త దిశను చూపించారు.
ఆ తర్వాత ఆయన తెరకెక్కించిన అనేక చిత్రాలు క్లాసిక్స్‌గా నిలిచాయి. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు 40కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగానూ భారతీరాజా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తనదైన నటనతో ఎన్నో విభిన్న పాత్రలను పోషించి ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల విడుదలైన తుడరుం చిత్రంలో ఆయన చివరిసారిగా కనిపించారు. అలాగే ఆయన నటించిన పులవర్ చిత్రం ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఇదే నటుడిగా ఆయన చివరి సినిమా కానుంది.
గ్రామీణ జీవన శైలిని సహజంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడిగా భారతీరాజా ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఎన్నో తరాల దర్శకులకు స్ఫూర్తిగా నిలిచిన ఆయన మరణంతో దక్షిణాది చిత్రసీమ ఒక గొప్ప లెజెండ్‌ను కోల్పోయింది. భారతీరాజా సేవలను గుర్తు చేసుకుంటూ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చిత్రాలు, ఆయన సృష్టించిన పాత్రలు, ఆయన చూపిన సినీ మార్గం ఎప్పటికీ చిరస్మరణీయంగానే నిలిచిపోతాయి.