కురిసిన ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం లక్షల కోట్లు వెచ్చించి యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. అంతే పట్టుదలతో ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకొనేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో సహజ నీటి వనరుల పరిరక్షణకు వ్యవస్థాగతంగానే కాకుండా, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతూ బహుముఖ వ్యూహాలను అనుసరిస్తున్నది. అద్భుతమైన సత్ఫలితాలను సాధిస్తున్నది. ఆ విజయాలపై మంగళవారం ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కథనం..
హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): పర్యావర ణవేత్తలు, నీటిరంగ నిపుణులు నీటి సంరక్షణకు దశాబ్దాలుగా ఉద్యమిస్తున్నారు. దేశంలోని అనేక ప్రభుత్వాలు జలవనరుల పరిరక్షణపై ఏ మాత్రం అవగాహన లేకుండానే, ప్రజలను భాగస్వాములను చేయకుండానే ప్రణాళికలను రూపొందిస్తూ అపహాస్యం పాలవుతున్నాయి. ఫలితంగా కోట్ల రూపాయలు నీళ్ల పాలవుతున్నాయి. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం అమ లు చేస్తున్న వ్యూహం పూర్తిగా విభిన్నం. సీఎం కేసీఆర్ ఒకవైపు నదీజలాల్లో వాటాను పూర్తిగా సద్వినియోగం చేసుకొనేందుకు ప్రణాళికాబద్ధంగా బరాజ్‌లను, రిజర్వాయర్లను నిర్మిస్తూనే మరోవైపు నదుల పునరుజ్జీవనానికీ బహుముఖ వ్యూ హాలను అమలు చేస్తున్నారు. ఈ చర్యలు సత్ఫలితాలు ఇవ్వ టంతోపాటు ప్రశంసలు అందుకొంటున్నాయి. దేశానికే దిక్సూచిగా నిలుస్తుండటం తెలంగాణకు గర్వకారణం.
తెలంగాణ ప్రభుత్వం నీటి కాలుష్య నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. పట్టణాల్లో మురుగునీరు నేరుగా చెరువు లు, కుంటల్లో కలువకుండా మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నది. హైదరాబాద్‌లోనే కాకుండా జిల్లాల్లోనూ ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నది. పల్లెప్రగతి పేరిట పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించడంతోపాటు డంప్‌యార్డును ఏర్పాటు చేసి నీటి వనరులు కలుషితం కాకుండా చూ స్తున్నది. తెలంగాణకు హరితహారం ఇందుకు ఊతమిస్తున్నది. మొక్కల పెంపకంతో పరోక్షంగా నేల కోతకు గురికాకుండా, నీటి వనరుల్లో పూడిక చేరకుండా నిరోధిస్తున్నది. నదుల్లో ఇసుక తొలగించకుండా ప్రభుత్వమే నియంత్రిస్తున్నది.
ప్రభుత్వం తనవంతుగా నీటి సంరక్షణకు అన్ని చర్యలు చేపడుతూనే, ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తున్నది. నీటివనరుల సంరక్షణ ఆవశ్యకతను వివరిస్తూ చైతన్యవంతులను చేస్తున్నది. ఉపాధి హామీలో భాగంగా పొలాల్లో ఫామ్‌పాండ్స్‌ను ఏర్పాటు చేస్తున్నది. కళాశాలల స్థాయిలో విద్యార్థులకు వాటర్ లిటరసీపై అవగాహన కల్పిస్తున్నది.
తెలంగాణ ప్రభుత్వం నీటి సంరక్షణకు అమలు చేస్తున్న బహుముఖ వ్యూహాలు, ప్రణాళికబద్ధ చర్యలపై నీటి నిపుణులు, శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు ప్రశంసలు కురిపిస్తున్నారు. స్కోచ్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ (సీబీఐపీ) సంస్థల నుంచి జాతీయస్థాయి అవార్డులు అందుకొన్నది. రాష్ట్రంలో భూగర్భ జలాల వినియోగం గణనీయంగా తగ్గిపోవడానికి ప్రభుత్వం తీసుకొన్న చర్యల ఫలితమేనని నీటి రంగ నిపుణులు వివరిస్తున్నారు.