న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో అక్కడ చిక్కుకున్న వేలాది మంది భారతీయ విద్యార్థులు, పౌరులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్ తన గగనతలం మూసివేసిన నేపథ్యంలో వారిని తరలించేందుకు కేంద్రం ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నది. రొమేనియా, హంగరీ సరిహద్దుల ద్వారా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అక్కడి భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఈ మేరకు రొమేనియా సరిహద్దు పోరుబ్నే-స్ట్రెత్, హంగరీ వైపున ఉన్న సరిహద్దు ప్రాంతమైన చాప్-జహోనీ వద్దకు భారత బృందాలను పంపినట్టు తెలిపింది. ఆయా సరిహద్దు ప్రాంతాలకు సమీపంలో ఉండేవారు.. విదేశాంగ శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని బయలుదేరాలని సూచించింది. పైన పేర్కొన్న రూట్లు అమల్లోకి వచ్చిన తర్వాత భారతీయులు సొంత రవాణా ఏర్పాట్ల ద్వారా సరిహద్దులకు చేరుకోవాలని, ప్రధానంగా వాహనాలకు భారత జాతీయ జెండాను అతికించుకోవాలని పేర్కొన్నది. సులభంగా చేరుకునేందుకు సరిహద్దు చెక్పాయింట్ల వద్ద ఏర్పాటు చేసిన హైల్ప్‌లైన్ నంబర్లతో టచ్‌లో ఉండాలని రాయబార కార్యాలయం పేర్కొన్నది. పాస్‌పోర్టు, అత్యవసర ఖర్చుల నిమిత్తం డాలర్ల రూపంలో డబ్బు అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది.
ఓ మెడికల్ కాలేజీ యాజమాన్యం 40 మంది భారతీయ విద్యార్థులని బస్సులో పొలాండ్ బోర్డర్‌కు 8 కిలోమీటర్ల దూరంలోనే విడిచిపెట్టడంతో.. నడుచుకుంటూ సరిహద్దుకు చేరుకుంటున్న విద్యార్థులు. మాతృభూమిపై ఉన్న ప్రేమ, అంకితభావం ముందు తుపాకీ గర్జన చిన్నబోయింది. తమ దేశాన్ని ఆక్రమిస్తున్న రష్యా సైనికుడిని ఉక్రెయిన్ మహిళ ఒకరు ధైర్యంగా ప్రశ్నించారు. ‘తమ గడ్డపై మీకేం పని’ అంటూ కన్నెర్రజేశారు. హెన్చెస్క్లో ఓ ఉక్రెయిన్ మహిళ బయటకు రావడంతో ఇంట్లోకి వెళ్లిపోవాలని రష్యా సైనికుడు చెప్పాడు. ఆగ్రహం, బాధ కట్టలు తెంచుకొన్న ఆ మహిళ ‘మీరు ఆక్రమణదారులు, మీరు నియంతలు, అసలు ఈ తుపాకులతో మీరు మా గడ్డపై ఏం చేస్తున్నారు’ అంటూ ఎదురు ప్రశ్నించారు. ‘ఈ పొద్దుతిరుగుడు విత్తనాలు తీసుకుని జేబులో వేసుకో. మీరు నేలకొరిగిన తర్వాత కనీసం ఆ మొక్కలైనా (పొద్దుతిరుగుడు ఉక్రెయిన్ జాతీయ పుష్పం) మొలుస్తాయి’ అని పేర్కొన్నారు. మహిళ ధైర్యాన్ని ప్రశంసిస్తూ ఆమెను ఉక్రెయిన్ ఉక్కు మహిళ అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.
రష్యా ఆక్రమణదారులను నిలువరిస్తున్న ఓ ఉక్రెయిన్ సైనికుడు.. యుద్ధ క్షేత్రం నుంచే ‘అమ్మా.. నాన్న ఐలవ్యూ. మిమ్మల్ని మళ్లీ కలుస్తానో.. లేదో’ అంటూ మాట్లాడిన ఈ వీడియో ప్రతీ ఒక్కరి హృదయాలను మెలిపెడుతున్నది. మాతృదేశ రక్షణ కోసం ఉక్రెయిన్ సేనలు తీవ్రంగా పోరాడుతున్నాయి.
సైనికచర్య పేరుతో ఉక్రెయిన్‌పై గురువారం ముప్పేట దాడిచేసిన రష్యా.. రెండోరోజు కూడా దాడులను కొనసాగించింది. రష్యా ఆక్రమణదారులను ఎదుర్కొనేందుకు ప్రజలు ముందుకొచ్చి యుద్ధం చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ విజ్ఞప్తి చేయడంతో పలువురు ఉక్రెయిన్ వాసులు దేశానికి అండగా ఉండేందుకు ముందుకొస్తున్నారు. అలా కీవ్ నగరంలోని ఓ తండ్రి తన కూతురిని సురక్షిత ప్రాంతానికి బస్సులో తరలిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. దేశ రక్షణ కోసం వెళ్తున్న తాను.. మళ్లీ తన బిడ్డను చూస్తానో,లేదోనని ఆ తండ్రి ఆందోళన. తండ్రి ఏడవగానే ఆ చిన్నారి కూడా కన్నీటిని ఆపుకోలేకపోయింది.