Unlimited Range | లాటినా (ఇటలీ), అక్టోబర్ 20: ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) రంగంలో అద్భుతం ఆవిష్కృతమైంది. మాడిఫై చేసిన ఓ ఎలక్ట్రిక్ కారుతో ‘అన్లిమిటెడ్ రేంజ్’ సాధ్యమైంది. ఇటలీలోని లాటినాలో గత నెల ఆ కారు పనితీరును ప్రదర్శించారు. 6 గంటలపాటు ప్రయాణించిన తర్వాత ఆ కారు బ్యాటరీలో శక్తి సాంద్రత తగ్గకపోగా మరింత పెరిగినట్టు ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ నిపుణులు తేల్చారు. ఈ ప్రదర్శనలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ రెనాల్ట్ తయారు చేసిన రెండు ‘ట్విజీ 80’ మోడళ్ల పనితీరును పరీక్షించారు. ఈ పరీక్షకు ముందు ఆ రెండు కార్ల బ్యాటరీల్లోని శక్తి సాంద్రతను నమోదు చేసుకున్నారు. వాటిలో 96% శక్తిని కలిగివున్న అన్మాడిఫైడ్ కారు 2 గంటల 20 నిమిషాల్లో 45 మైళ్ల దూరం ప్రయాణించిన తర్వాత బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జి కావడంతో ఆగిపోయింది.
కానీ, ‘ఈ-క్యాట్’ పవర్ జనరేషన్ సిస్టమ్‌ను అమర్చిన మాడిఫైడ్ కారు మాత్రం అద్భుతమైన పనితీరును కనబర్చింది. బ్యాటరీలో 62% శక్తి సాంద్రతను కలిగివున్న ఆ కారు నిరంతరాయంగా 6 గంటల్లో 124 మైళ్ల దూరం ప్రయాణించిన తర్వాత శక్తి సాంద్రత 83 శాతానికి పెరిగింది. ఇది ఆ వాహన పరీక్ష ప్రారంభమైనప్పుడు బ్యాటరీలో ఉన్న శక్తి కంటే 33% అధికం. ఈ కారులో అమర్చిన ‘ఈ-క్యాట్’ పవర్ జనరేషన్ సిస్టమ్‌ను లియోనార్డో కార్పొరేషన్ అభివృద్ధి చేసింది. నడుస్తున్న ఎలక్ట్రిక్ వాహనం బ్యాటరీని ‘ఈ-క్యాట్’ టెక్నాలజీతో నిరంతరాయంగా చార్జింగ్ చేయవచ్చని, తద్వారా ఆ వాహనం ఇంధనంతో పనిలేకుండా ఎలాంటి ఉద్గారాలను వెలువరించకుడా అపరిమిత దూరం ప్రయాణించగలుగుతుందని ఆ కంపెనీ చెప్తున్నది.