ఇల్లు సర్దడం అన్నది.. పని అనుకుంటే పని. ఆటవిడుపు అనుకుంటే ఆటవిడుపు. పనిగా భావిస్తే శ్రమ మిగులుతుంది. ఆటవిడుపు అని తలిస్తే ఆనందం తోడవుతుంది. మానసిక ఒత్తిడికి ‘ఇల్లు సర్దడం’ అనేది చిరు చికిత్సలాంటిది. ఆడుతూ పాడుతూ చేయాలి. తొలిరోజే భారీ లక్ష్యాల జోలికి వెళ్లకండి. ఎందుకంటే, పూర్తికాకపోతే నిరాశపడతారు. డైనింగ్ టేబుల్ క్లీనింగ్, బుక్‌షెల్ఫ్ క్లీనింగ్ వంటి చిన్నచిన్న పనులతో ప్రారంభించండి. ఎంచుకున్న పనిని నిర్దిష్ట సమయంలోనే పూర్తి చేయండి. దీనివల్ల ఇంకొక పనిచేయాలనే ఉత్సాహం వస్తుంది. గదిని శుభ్రం చేసేముందు అన్ని వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించండి. ఏది అవసరమో? ఏది కాదో తేల్చుకోండి. నిరుపయోగంగా ఉన్నవాటిని అవసరపడే వారికి ఇవ్వండి.