సంగారెడ్డి, జూన్ 15(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలోని నీటిపారుదల శాఖలో కీలకమైన చీఫ్ ఇంజినీర్, సూపరింటెండెంట్ ఇంజినీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ రెండు పోస్టుల్లో ఖాళీలు ఏర్పడి పక్షం రోజులు అయ్యాయి. కీలకమైన రెండు పోస్టుల్లో చేరేందుకు ఆ శాఖలోని అధికారులు ఎవరూ ముందుకు రావడం లేదు. కనీసం ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. మంత్రులు సూచించినా చీఫ్ ఇంజినీర్, ఎస్ఈ పోస్టుల్లో చేరేందుకు అధికారులు ససేమిరా అంటున్నట్లు తెలిసింది. ఒకప్పుడు సంగారెడ్డి జిల్లాలో నీటిపారుదలశాఖలో పనిచేసేందుకు అధికారులు పోటీ పడేవారు. హైదరాబాద్‌కు సంగారెడ్డి జిల్లా సమీపంగా ఉండడం, నీటిపారుదల శాఖలో ఎలాంటి ఒత్తిళ్లు లేకపోవటంతో ఇక్కడ పనిచేసేందుకు ఇరిగేషన్ అధికారులు ఆసక్తి చూపేవారు.
జిల్లాలో పోస్టు దక్కించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. నీటిపారుదల శాఖలో పనిచేసేందుకు అధికారులు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఇందుకు సంగారెడ్డి జిల్లాలో చీఫ్ ఇంజినీర్, సూపరింటెండెంట్ ఇంజినీర్ పోస్టులు ఖాళీగా ఉండటాన్ని ఉదాహరిస్తున్నారు. రాష్ట్ర స్థాయితో పాటు జిల్లాలోని అధికారులు ఎవరూ ఆ పోస్టుల్లో చేరేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. ఇతర జిల్లాలకు చెందిన అధికారులు సీఈ, ఎస్ఈ పోస్టుల్లో చేరేందుకు ఆసక్తి చూపినప్పటికీ, జిల్లాలోని పరిస్థితులను చూసి వెనక్కు తగ్గుతున్నట్లు సమాచారం. నీటిపారుదల శాఖ అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు పెరగడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తున్నది.
సంగారెడ్డి జిల్లాలో నీటిపారుదల శాఖలో సీఈ, ఎస్ఈ పోస్టులు భర్తీ కాకుండా పక్షం రోజులు అవుతున్నది. చీఫ్ ఇంజినీర్‌గా పనిచేసిన ధర్మను ప్రభుత్వం ఈఎన్సీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ ఈనెల 1న ఉత్తర్వులు జారీ చేసింది. ధర్మపై అవినీతి ఆరోపణలు వచ్చిన కారణంగానే ఆయన్ను సీఈ పోస్టు నుంచి తప్పించినట్లు తెలుస్తున్నది. ఎన్వోసీ జారీ విషయంలో భారీ ఎత్తున డబ్బులు డిమాండ్ చేయడంతో సీఈ ధర్మపై ప్రభుత్వం బదిలీ వేటు వేసినట్లు సమాచారం. ధర్మ స్థానంలో ప్రభుత్వం కొత్త సీఈని ఇంత వరకు నియమించలేదు. సంగారెడ్డి సీఈగా పనిచేసేందుకు ఇరిగేషన్ శాఖలోని అధికారులు ఆసక్తి చూపడం లేదని తెలుస్తుంది. మొదట ఖమ్మం, హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు అధికారులు సంగారెడ్డి సీఈ పోస్టుపై ఆసక్తి కనబర్చారు.
తీరా జిల్లాలోని పరిస్థితులను తెలుసుకున్న తర్వాత సీఈ పోస్టులో చేరే ప్రయత్నాలను ఇద్దరు అధికారులు విరమించుకున్నట్లు సమాచారం. సీఈ పోస్టులో చేరేందుకు అర్హత ఉన్న అధికారులు ఎవరూ సంగారెడ్డి జిల్లాకు వచ్చేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తున్నది. సంగారెడ్డి జిల్లాకు వెళ్లాలని ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నా, ఆ జిల్లాకు వెళ్లమని అధికారులు సున్నితంగా తిరస్కరిస్తున్నట్లు సమాచారం. ఇన్చార్జి సీఈగా సైతం బాధ్యతలు చేపట్టేందుకు సైతం అధికారులు ఆసక్తి చూపడం లేదు. సంగారెడ్డి సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ పోస్టు సైతం పక్షం రోజులుగా ఖాళీగా ఉంది. ఎస్ఈగా పనిచేసిన యేసయ్య గతనెల 31న ఉద్యోగ విరమణ చేశారు.
అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది. ఎస్ఈ పోస్టులో చేరేందుకు అధికారులు ఎవరూ ముందుకు రావడం లేదని లేదని తెలిసింది. ఇన్చార్జి ఎస్ఈగా సైతం బాధ్యతలు తీసుకునేందుకు అధికారులు ఆసక్తి చూపడం లేదు. సంగారెడ్డి సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న ఈఈలు ఇన్చార్జి ఎస్ఈగా బాధ్యతలు చేపట్టాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించినా అధికారులు సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. జిల్లాలో 4 డీఈ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇందులో జహీరాబాద్ డివిజన్లో 2, నారాయణఖేడ్ డివిజన్లో 2 ఖాళీ ఉన్నాయి. ఏఈ పోస్టులు సంగారెడ్డి డివిజన్లో 1, దౌల్తాబాద్ డివిజన్లో 3 ఖాళీ ఉన్నాయి.
నీటిపారుదలశాఖలోని అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతుండడంతోనే సంగారెడ్డి జిల్లాలో సీఈ, ఎస్ఈగా పనిచేసేందుకు అధికారులు విముఖత చూపుతున్నట్లు తెలిసింది. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు తాము చెప్పిన పనులు చేయాలని ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి చేయడంతో పాటు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న పనులు సైతం పూర్తి చేయాలని అధికారులను దబాయిస్తున్నట్లు తెలిసింది. తాము సూచించిన వ్యక్తులకు ఇరిగేషన్ కాంట్రాక్టులు ఇవ్వాలని, తాము చెబితేనే బిల్లులు చెల్లించాలని ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.
ముఖ్యంగా ఎన్ఓసీ జారీ విషయంలో ప్రజాప్రతినిధులు ఇరిగేషన్ అధికారులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. తాము సూచించిన వ్యక్తులకు ఎన్వోసీలు ఇవ్వాలని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ ఎన్వోసీలు ఇవ్వాలని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. సంగారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గాల్లో ఎన్వోసీల జారీ విషయంలో ప్రజాప్రతినిధుల ప్రమేయం అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది.
తాను సూచించిన వ్యక్తులకు ఎన్వోసీ జారీచేయకపోవటంతో ఆగ్రహించిన ఓ ఎమ్మెల్యే నీటిపారుదల శాఖ అధికారిని బూతులు తిట్టడంతో పాటు సస్పెండ్ చేయిస్తానని బెదిరించినట్లు సమాచారం. ఎన్వోసీల విషయమై రాజకీయ ఒత్తిళ్లు విపరీతంగా పెరుగుండటంతో ఇరిగేషన్ అధికారులు మనోవేదనకు గురవుతున్నారు. రాజకీయనాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేయలేక కొంతమంది అధికారులు ఇక్కడి నుంచి ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
ఇరిగేషన్ శాఖలో రాజకీయ పెత్తనం పెరగడంతోనే సంగారెడ్డి జిల్లాలో ఖాళీగా ఉన్న సీఈ, ఎస్ఈ పోస్టుల్లో చేరేందుకు ఆధికారులు విముఖత చూపుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే జిల్లాలో సింగూరు కాల్వల ఆధునికీరణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. పనులు పూర్తికాక ఇప్పటికే ఆయకట్టు రైతులు రెండు పంటలు కోల్పోయాయి. జిల్లా సాగునీటి రంగంపై పర్యవేక్షణ లేక, పనులు వేగంగా పూర్తికాక ఆయకట్టు రైతులకు నీళ్లందక పంటలు పండక నష్టపోతున్నారు. నిజాయితీ, నిక్కచి గల అధికారులతో సీఈ,ఎస్ఈ పోస్టులు భర్తీ చేసి జిల్లాలో సాగునీటి రంగాల్లో బలోపేతం చేయాలని రైతులు కోరుతున్నారు.